Sarpanch Elections: గెలిపిస్తే పెళ్లి కానుకగా రూ.5,116, ఎవరైనా మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 5116
కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఓ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి వినూత్న ప్రచారం
మహబూబాబాద్, స్వేచ్ఛ: గ్రామపంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Elections) రోజుకో రకమైన కొత్త ప్రచారాలు తెరపైకి వస్తున్నాయి. కొందరు తమను సర్పంచ్‌గా గెలిపిస్తే ఉచితంగా షేవింగ్, హెయిర్ కటింగ్ చేస్తామని, మరికొందరు ఇతర మరికొన్ని సేవలు అందిస్తామంటూ స్టాంపు పేపర్‌పై రాసిస్తూ మరి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి ఆసక్తికరమైన ప్రచారమే మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
బుడిగబోయిన శృతి అశోక్ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) మద్దతు ఆశించారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్ అభ్యర్థినిగా అవకాశం లభించకపోవడంతో, గ్రామంలోని యువత, భర్త అశోక్ స్నేహితుల ప్రోత్సాహంతో ఆమె స్వతంత్ర అభ్యర్థినిగా బరిలోకి దిగారు. పోటీ చేయడమే కాదు, తాము గెలిస్తే మొదటి రోజు నుంచే అమలు చేయదలిచిన కార్యక్రమాలతో ఒక స్టాంపు పేపర్‌పై మేనిఫెస్టో సిద్ధం చేశారు. ఆ హామీలను ఓటర్లకు వివరిస్తున్నారు. సాధారణంగా ఎన్నికల్లో పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటిస్తుంటాయి. కానీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లోని స్వతంత్ర అభ్యర్థి కూడా మేనిఫెస్టోను తయారు చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ముఖ్య హామీలు ఇవే
బుడిగబోయిన శృతి అశోక్ సర్పంచ్‌గా గెలిచిన నాటి నుంచే, వారికున్న టెంట్ హౌస్‌ను గ్రామ పంచాయతీకి అప్పగించి, ఉచితంగా శుభకార్యాలకు వాడుకునే విధంగా అందిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, గెలిచిన నాటి నుంచే ప్రతి ఇంటికి మినరల్ వాటర్‌ను ఉచితంగా సరఫరా చేస్తామని హామీ పత్రంలో రాశారు. అంతేకాదు, గ్రామంలో పేదింటిలో పెళ్లి జరిగితే వారికి పెళ్లి కానుకగా రూ. 5116, అలాగే పంచాయతీ పరిధిలో ఎవరైనా మరణిస్తే బాధిత కుటుంబానికి కూడా రూ. 5,116 అందిస్తామని హామీ పత్రంలో పేర్కొన్నారు. ఈ హామీలనే ప్రధాన అస్త్రాలుగా వాడుకుంటూ శృతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ కత్తెర గుర్తుకు ఓటు వేసి సర్పంచ్‌గా గెలిపించాలని గ్రామస్తులను అభ్యర్థిస్తున్నారు.
Read Also- Viral News: బిజినెస్ ట్రిప్‌కి వెళ్తున్నా అని చెప్పి.. థాయ్‌లాండ్‌లో ప్రేయసితో పట్టుబడ్డ భర్త!
యువత, స్నేహితుల సహకారంతో..
స్థానిక యువత, బుడిగబోయిన అశోక్ స్నేహితుల సహకారంతో తన భార్య శృతిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టానని అశోక్ పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధి జరగడమే తమ ముఖ్యఉద్దేశమని, అది జరగాలంటే ఒక పారదర్శకమైన మేనిఫెస్టో ఉండాలని ఆయన చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని చూసి గ్రామానికి పారదర్శక పాలన అందించాలనే ఉద్దేశంతోనే తన భార్యను సర్పంచ్ అభ్యర్థినిగా నిలబెట్టానని ఆయన వివరించారు. గతంలో ఉన్న సర్పంచ్‌ల వల్ల గ్రామం అభివృద్ధి జరగలేదని, అందుకే తాము ఒక అడుగు ముందుకేసి రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు.. తమను గ్రామ ప్రజలు ఆదరించి, వారి అమూల్యమైన ఓటును తమ కత్తెర గుర్తుపై వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నట్లు వివరించారు. గ్రామ అభివృద్ధిలో ఓటు వేసి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ హామీలను నిలబెట్టుకోకపోతే ఆరు నెలల్లోనే స్వచ్ఛందంగా పదవి నుంచి తొలగిపోతామని కూడా వారు హామీ పత్రంలో స్పష్టంగా పేర్కొనడం విశేషం.

