– ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతోనే, నేరగాళ్లతో కాదు
– డ్రగ్ పెడ్లర్స్, సైబర్ నేరగాళ్లకు వణుకు పుట్టాలి
– సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణకు అందరూ సహకరించాలి
– డ్రగ్స్ నియంత్రణకు సినిమా వాళ్లు ముందుకు రావాలి
– సినిమా టికెట్ల ధరలు పెంచమంటున్నారు కానీ డ్రగ్స్‌పై అవగాహన కల్పించడం లేదు
– ఇకపై ప్రతీ సినిమాకు ముందు డ్రగ్స్‌పై అవేర్‌నెస్ వీడియో ఉండాలి
– అలా చేయకపోతే టికెట్ రేట్లు పెంచేది లేదు
– థియేటర్లకు అనుమతులు ఉండవు
– సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
– యాంటీ నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కొత్త వాహనాల పంపిణీ
CM revanth reddy warning to film industry(Today news in telangana): డ్రగ్స్ నియంత్రణకు సినిమా వాళ్లు ముందుకు రావాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్‌లో యాంటీ నార్కోటిక్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు కొత్త వాహనాలను పంపిణీ చేశారు. యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు 27 ఫోర్ వీలర్స్, 40 టూ వీలర్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు 14 ఫోర్ వీలర్స్, 30 టూ వీలర్స్ వాహనాలు అందించారు. నార్కోటిక్, సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు సీఎం. పోలీస్ వ్యవస్థలో వివిధ విభాగాలను ఏర్పాటు చేసి నేరాలను నియంత్రిస్తున్నట్టు వివరించారు.
టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంటే, ఆర్థిక నేరాల్లో సైబర్ నేరాలు కూడా అప్డేట్ అవుతున్నాయని అన్నారు సీఎం. సైబర్ నేరాలను నియంత్రించడానికి సైబర్ బ్యూరో ముందుకెళ్తుందని, అందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అధికారులు, సిబ్బంది నియామకం, వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ‘‘ప్రపంచం మొత్తంలో సైబర్ క్రైమ్ పెద్ద నేరం. 1930 కాల్ సెంటర్ ఏర్పాటు చేసాం. అమాయకులు ఎవరూ మోసపోవట్లేదు. చదువుకున్న వాళ్లే ఎక్కువగా మోసపోతున్నారు. 31 కోట్ల రూపాయలు బాధితులకు అందజేసాం. సైబర్ బ్యూరోని అభినందిస్తున్నా. భారత కొత్త చట్టాలను స్వాగతిస్తున్నాం. టెక్నాలజీ, క్రైమ్‌కు అనుగుణంగా చట్టాల్లో మార్పు చేశారు. గత 10 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల గల్లీ గల్లీకి గంజాయి, డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. డ్రగ్స్ నిర్ములనను పటిష్టం చేసాం’’ అని అన్నారు రేవంత్ రెడ్డి.
గంజాయి వల్ల చిన్న పిల్లలపై దాడులు జరుగుతున్నాయని, తెలంగాణలో పోలీసులు సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణకు ముందుండి కృషి చేస్తున్నారని కొనియాడారు. సైబర్ నేరాలు, డ్రగ్స్ నియంత్రణ చేస్తే రివార్డ్స్ ఇస్తామని, నైపుణ్యత ప్రదర్శించి నిందితులను పట్టుకోవాలని పోలీసులకు తెలిపారు. పట్టుకుంటే నగదు బహుమతితో పాటు పదోన్నతి ఇస్తామని చెప్పారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్‌పై అవగహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ‘‘డ్రగ్స్‌పై అవగహన చేస్తూ వీడియో చేసిన మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు. డ్రగ్స్ నియంత్రణపై సినీ తారలు వీడియోలు తీయాలి. దానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది. వందల కోట్ల బడ్జెట్ సినిమా అయినా సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన కల్పించేలా సినిమాకు ముందు ప్రదర్శించాలి. సినిమా టికెట్ల ధరలు పెంచాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు కానీ వీటిపై అవగాహన కల్పించడం లేదు. అలా చేయకపోతే వారి సినిమాలకు టికెట్లు పెంచే ప్రసక్తి లేదు. అలాంటి నిర్మాతలకు, డైరెక్టర్లకు, తారాగణానికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు ఉండవు. సినిమా థియేటర్లు యాజమాన్యాలు కూడా సహకరించాలి. డ్రగ్స్, సైబర్ నేరాలపై థియేటర్లలో ప్రసారం చేయకపోతే అనుమతి ఉండదు. అన్ని థియేటర్లలో సినిమా విడుదలకు ముందు సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై అవగాహన వీడియోలు రిలీజ్ చేయాలి. అందరి సహకారంతోనే డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ నియత్రించవచ్చు. తెలంగాణలో డ్రగ్ పెడ్లర్స్, సైబర్ నేరగాళ్లు అడుగు పెట్టాలంటే వణుకు పుట్టాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే బాధితులతో మాత్రమే ఉండాలి, నేరగాళ్లతో ఉండొద్దు’’ అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి.