KCR: ‘తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయి. అప్పటి దాకా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడొద్దు’ అని మాజీ సీఎం కేసీఆర్(KCR) భరోసా ఇచ్చారు. ‘మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్ని కొన్ని సమయాలు కష్టాలు వస్తాయి. వాటికి వెరవకూడదు, మళ్లీ మన ప్రభుత్వమే వస్తుంద’ని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు నడవాలని ఆయన సూచించారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్లు ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎర్రవెల్లి సర్పంచులు శుక్రవారం హైదరాబాద్‌లో కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచులను శాలువాలతో సత్కరించిన కేసీఆర్, మిఠాయిలు పంచారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని, గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతులు, పంటల సాగుపై ఆరా తీశారు.
పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శం
బీఆర్ఎస్ పాలనలో గొప్పగా వర్ధిల్లిన గ్రామాల పరిస్థితి నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని రకాలుగా దిగజారాయని సర్పంచులు కేసీఆర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెంది, స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని గుర్తు చేశారు. దళిత, గిరిజన, బహుజన మహిళా వర్గాలకు, కుల వృత్తులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, గ్రామీణాభివృద్ధికి అమలు చేసిన పథకాలు, పల్లె ప్రగతికి అందించిన ఆర్థిక సహకారం, పంచాయితీరాజ్ వ్యవస్థ బలోపేతానికి తోడ్పాటును అందించాయని వివరించారు. తాను ముఖ్యమంత్రిగా చేపట్టిన పాలనా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు.
ఎవరో చేస్తారని ఆశపడొద్దు
‘ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు’ అని నూతనంగా ఎన్నికవుతున్న సర్పంచులకు కేసీఆర్ సూచించారు. గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలన్నారు. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎర్రవెల్లి గ్రామ సర్పంచ్ నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి దంపతులు, ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్, నర్సన్నపేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య సహా ఇరు గ్రామాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.
Also Read: Mahabubabad News: మహబూబాబాద్ రైల్వే మెగా డిపో తరలింపులో భారీ కుట్ర ఉంది: మహ్మద్ ఫరీద్

