Rising Global Summit: ‘తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్’కు రావాలంటూ ఆహ్వానం
ఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను (Omar Abdullah) తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) శుక్రవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్’ (Rising Global Summit) రావాలంటూ ఉత్తమ్ అధికారికంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలంగాణ లక్ష్యాలను అబ్దుల్లాకు వివరించారు. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ‘విజన్ 2047’ (Vision 2047) లక్ష్యాలను వివరిస్తామని, తెలంగాణను మూడు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వివరించారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని, అయితే తక్కువ సమయంలోనే ఆహ్వానం ఇవ్వాల్సి వచ్చిందని అబ్దుల్లాకు ఉత్తమ్ చెప్పారు.
ఒమర్ అబ్దుల్లా ఏమన్నారంటే
గ్లోబల్ సమ్మిట్‌కు తనను ఆహ్వానించినందుకుగానూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సీఎం ఒమర్ అబ్దుల్లా ధన్యవాదాలు తెలిపారు. తాను గ్లోబల్ సమ్మిట్‌కు హాజరు కాకపోయినా, ఈ సదస్సు విజయవంతం కావాలని అభిలాషిస్తున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రపంచ స్థాయి అభివృద్ధి చెందుతోందని ఈ సందర్భంగా ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, అబ్ధుల్లాతో భేటీకి ముందు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిశారు. తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు రావాలంటూ ఆహ్వానించారు.
సదస్సు వేదిక ఫొటో రిలీజ్
తెలంగాణకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చి, రాష్ట్రాన్ని పెట్టుబడులు, ఆవిష్కరణలకు గమ్యస్థానంగా మార్చే ఉద్దేశంతో డిసెంబర్ 8, 9 తేదీలలో హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్‌ను ఫ్యూచర్ సిటీలో (Future City) నిర్వహిస్తుండగా, వేదిక నిర్మాణానికి సంబంధించిన తొలి ఫొటో శుక్రవారం నాడు విడుదలైంది. డ్రోన్‌తో తీసిన ఈ ఫొటో అబ్బుర పరుస్తోంది. వేదిక నిర్మాణంలో జరిగిన పురోగతి ఈ ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇప్పటికే రూపుదిద్దుకుంటున్న భవిష్యత్తుకు ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ నగరం సమాయత్తమవుతోందని ఈ సందర్భంగా ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందుతున్న ఫ్యూచర్ సిటీలో వచ్చే సోమ, మంగళవారాల్లో ప్రపంచ పారిశ్రామిక నాయకులు, ఆవిష్కర్తలు, విజనరీ వ్యక్తులకు ఈ ప్రాంతం స్వాగతం పలుకుతుందని హర్షం వ్యక్తం చేశారు. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తన ఆశయం, సాంకేతికత, అవకాశాల ద్వారా సాహసోపేతమైన సరికొత్త అభివృద్ధి నమూనాను తెలంగాణ ప్రదర్శిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఈ సందర్భంగా పేర్కొన్నాయి.
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ
‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం ఇదే వేదికపై ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్’ను కూడా విడుదల చేయనుంది. అంతేకాదు, అభివృద్ధి నమూనాను కూడా ఆవిష్కరించనుంది. క్యూర్ (Core Urban Region Economy), ప్యూర్ (Peri-Urban Region Economy), రేర్ (Rural and Agri Region Economy) వంటి అంశాలపై దృష్టి సారించి సమగ్ర వృద్ధి నమూనాను ప్రదర్శించేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది.
Read Also- Ram Gopal Varma: వర్మ తనలోని ఇంకొకడ్ని తీశాడయ్యో.. ‘మ్యాడ్ మాన్‌స్టర్’ న్యూ అవతార్!

