Telangana Tourism: అటవీశాఖ నిబంధనలు రాష్ట్రంలో టూరిజానికి అడ్డంకిగా మారాయి. అభివృద్ధి పనులు చేపట్టేందుకు పర్యాటకశాఖ శ్రీకారం చుట్టగానే వెంటనే అటవీశాఖ అధికారులు ఇది అటవీ ప్రాంతం అంటూ.. టైగర్ జోన్స్ అంటూ.. ఇక్కడ పనులు చేపట్టొద్దని జీవోలు చూపుతున్నట్లు సమాచారం. దీంతో ఒక చెట్టు తొలగించి మరో స్థలంలో నాటుతామని చెప్పినప్పటికీ ససేమిరా అంటున్నట్లు సమాచారం. అంతేకాదు కేంద్ర అటవీశాఖకు సైతం లేఖలు రాస్తూ అక్కడి నుంచి కూడా పర్యాటకశాఖకు జీవోలు ఇప్పిస్తున్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి అనుమతి రావాలంటే మళ్లీ రెండేళ్ల సమయం పడుతుందని, ఆ గడువులోకా కేంద్రం పర్యాటకశాఖకు మంజూరు చేసిన నిధులు రిటన్ వెళ్తున్నట్లు సమాచారం. రాష్ట్ర అటవీశాఖ అధికారుల అత్యూత్సాహంతోనే తెలంగాణ టూరిజానికి అడ్డంకిగా మారిందని స్వయంగా టూరిజంశాఖ అధికారులే పేర్కొంటున్నారు.
అమరగిరి ఓకే చెప్పి..
నాగర్ కర్నూల్ జిల్లాలో ఈ ఏడాది ఆగస్టు అమరగిరి ఐలాండ్ లో సుమారు రూ.40కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం పనులకు శంకుస్థాపన చేశారు. అయితే తొలుత ఇక్కడ అభివృద్ధి పనులపై అటవీశాఖ అధికారులతోనూ సంప్రదింపులు చేసినట్లు టూరిజం అధికారులు తెలిపారు. అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఆ తర్వాత పనులు ప్రారంభించే సమయానికి ఇది ఫారెస్టు భూమి అని, ఇక్కడ చెట్లు తొలగించడానికి వీలు లేదని అటవీశాఖకు చెందిన ఓ డీఎఫ్ఓ మూడునెలల తర్వాత అభ్యంతరం చెప్పారు. దీంతో వెంటనే రెవెన్యూ రికార్డులను సైతం టూరిజం శాఖ పరిశీలించింది.
కేంద్రానికి లేఖ..
అంతేకాదు జిల్లా కలెక్టర్ ను సైతం సంప్రదించడంతో ఇది రెవెన్యూ భూమి అని స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ జిల్లా డీఎఫ్ఓ మాత్రం అమగిరిలోని భూమి టైగర్ జోన్ కిందకు వస్తుందని కేంద్రానికి లేఖ రాసినట్లు అధికారులు తెలిపారు. దీంతో అక్కడ పనులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాలంటే రెండేళ్ల సమయం పడుతుందని సమాచారం. అంతేకాదు కేంద్రం టూరిజంశాఖ రాష్ట్రానికి మంజూరు చేసిన నిధులు నిర్ణీత కాలసమయంలో వినియోగించాలనే నిబంధన ఉంది. దీంతో అధికారులు ప్రత్యామ్యాయ మార్గాలు అన్వేషించినట్లు సమాచారం.
మల్లేశ్వరం ఐలాండ్ కు మహర్దశ..
ఫారెస్టు అధికారుల పుణ్యమా అని అమరగిరి ఐలాండ్ అబివృద్ధి మధ్యలోనే నిలిచిపోయింది. కేంద్ర పర్యాటకశాఖ మంజూరు చేసిన రూ. 60కోట్లు నిర్ణీత సమయంలోనే అభివృద్ధి పనులు చేపట్టాలనే నిబంధన ఉండటంతో అమరగిరి నుంచి పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం ఐలాండ్ కు మార్చినట్లు అధికారులు తెలిపారు. చుట్టూ ఎటు చూసినా కనుచూపు మేర శ్రీశైలం తిరుగు జలాలు, పదెకరాల్లో కృష్ణానది మధ్యలో ఉన్న ఈ దివికి మహార్దశ పట్టినట్లయింది. రూ.48 కోట్లతో ఇక్కడ అభివృద్ధి చేయనున్నారు. కాటేజీలు, ధ్యాన కేంద్రం, రెస్టారెంట్లు, ఈత కొలను, ఆటస్థలం, పార్కులు నిర్మించనున్నారు. ఇక్కడ అభివృద్ధి చేస్తే మల్లేశ్వరం గ్రామానికి ఈ ఐలాండ్ 2 కిలో మీటర్లు, ఏకముకల్ కు కిలో మీటర్, కొల్లాపూర్ మండలం సోమశిల నుంచి 5 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. మల్లేశ్వరం గ్రామంలో టూరిస్టులకు వసతి, అతిధ్య ఆదాయం పెరుగుతుందని, స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
Also Read: Cartier Watches Controversy: కుర్చీ పాయే వాచ్ వచ్చే.. కొత్త వివాదంలో డీకే, సిద్ధరామయ్య.. ఏకిపారేస్తున్న విపక్షాలు!
అటవీశాఖ అధికారుల కొర్రీలతో..
కల్వకుర్తి (సోమశిల)- ఏపీలోని నంద్యాల(సిద్దేశ్వరం) ఐకాన్ బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో దాదాపు 70 కిలో మీటర్ల దూరభారం తగ్గుతుండటంతో మల్లేశ్వరం ఐలాండ్ పర్యాటకులను మరింతగా ఆకర్షించనున్నాయి. ఇది ఇలా ఉంటే అటవీశాఖ అధికారుల కొర్రీలతో మాత్రం టూరిజం శాఖ బలోపేతానికి అడ్డంకిగా మారుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఒక్క అమరగిరికే కాదు.. ఇలా పలు ప్రాంతాల్లో ఏకోటూరిజం, ఇతర ప్రాజెక్టులు, సైకిల్ ట్రాక్, కాటేజీలు ఇలా ప్రతిదానికి అడ్డుపడుతున్నారని టూరిజం అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చొరవ తీసుకుంటూ తప్ప కొన్ని టూరిజం అభివృద్ధి పనులు ముందుకు వెళ్లేలా కనిపించడం లేదు.

