Para Player Vinay: దేశీయ విమానయాన రంగ దిగ్గజం ఇండిగో (Indigo) శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా 700లకు పైగా విమానాల రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా ప్రధాన ఎయిర్‌పోర్టుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అకస్మాత్తుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో చాలా మంది ప్రయాణికులు షెడ్యూల్ చేసుకున్న అత్యంత ముఖ్యమైన పనులను సైతం చక్కబెట్టుకోలేని అగత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓ పారా క్రీడాకారుడి లక్ష్యాన్ని (Para Player Vinay Reddy) ప్రశ్నార్థకంగా మార్చివేసింది. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా జగదేవపూర్‌కి చెందిన పారా క్రీడాకారుడు నేవూరి వినయ్ రెడ్డి రేపు (శనివారం) ఢిల్లీలో జరిగే ‘పారా షూటింగ్ రైఫిల్ నేషనల్ ఛాంపియన్‌షిప్’లో పాల్గొనాల్సి ఉంది. అయితే, అతడు ప్రయాణించాల్సిన ఇండిగో విమానం రద్దు కావడంతో, ప్రస్తుతం అతడు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో (Player Stranded In Airport) పడిగాపులు కాస్తున్నాడు.
తన పరిస్థితిపై వినయ్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ద్వారా తాను కోచింగ్ తీసుకున్నానని తెలిపాడు. పారా ఒలింపిక్స్‌లో ఆడాలనేది తన కల అని, అందుకోసం 5 సంవత్సరాలుగా సాధన చేస్తున్నట్టు చెప్పాడు. రేపు (శనివారం) ఉదయం 8 గంటలకు ఢిల్లీలోని డాక్టర్ కర్ణిసింగ్ షూటింగ్ రేంజ్‌లో పారా షూటింగ్ రైఫిల్ నేషనల్ ఛాంపియన్ పోటీల్లో పాల్గొనాల్సి ఉందని వివరించాడు. కానీ, తాను ప్రయాణించాల్సిన ఫ్లైట్ కాన్సెల్ అయ్యిందని, ఆ తర్వాత రీ షెడ్యూల్ చేయగా, అది కూడా రద్దు అయిందని వాపోయాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని వినయ్ రెడ్డి చెప్పాడు.
‘‘పారా ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది నా కల. ఢిల్లీలో జరిగే ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనాలి. కానీ, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. వేరే విమానంలో వెళ్దామన్నా కూడా టికెట్స్ దొరకడం లేదు. ఇండిగో సంస్థ వాళ్లను ఎంత వేడుకున్నా కూడా స్పందించడం లేదు’’ అని వినయ్ రెడ్డి వాపోయాడు.

