Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి పదేళ్లు గడిచినా.. ఇంకా విభజన చట్టంలోని అనేక అంశాలు పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇప్పటికీ అవి ఉభయ రాష్ట్రాల వృద్ధిలో అడ్డుతగులుతున్నాయి. ఈ హామీల అమలుకు ఉభయ రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నా సానుకూల వాతావరణంలో చర్చించిన దాఖలాలు లేవు. కేంద్ర ప్రభుత్వం ముందు ఇరు రాష్ట్రాలు ఈ డిమాండ్‌ను ముందు పెట్టినా పరిష్కారం జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
I have written to the Hon’ble Chief Minister of Telangana, Sri @revanth_anumula Garu, proposing a meeting to discuss matters of mutual interest between our two Telugu-speaking States. I look forward to working closely with him to resolve post-bifurcation issues, enhance… pic.twitter.com/RKVbBYwpxO
— N Chandrababu Naidu (@ncbn) July 1, 2024
ఉభయ రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విభజన హామీలపై చర్చించుకుందామని, ఉభయ రాష్ట్రాల అభివృద్ధికి ఉపకరించేలా పెండింగ్ అంశాలను పరిష్కరించుకుందామని చంద్రబాబు అందులో పేర్కొన్నారు. పరస్పరం సహకరించుకుని ముందుకు సాగుదామని తెలిపారు. ఇందుకు తాను సీఎం రేవంత్ రెడ్డి వద్దకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం చర్చించుకుంటే బాగుంటుందని తాను ప్రతిపాదిస్తున్నట్టు లేఖలో ప్రస్తావించారు.
ఈ లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సానకూలంగా స్పందించారు. మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాయనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రతిపాదించినట్టుగానే 6వ తేదీన ఆయనతో భేటీ కావడానికి సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలిసింది. ప్రజాభవన్‌లో వీరిద్దరూ భేటీ అయ్యే అవకాశం ఉన్నది. పక్క రాష్ట్రంతో సఖ్యంగా ఉంటామని మొదటి నుంచీ చెబుతున్నారు.