Kavitha: నేను 20 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేశాను.. కానీ, నన్ను కనికరం లేకుండా సస్పెండ్ చేసి రోడ్డు మీద వేశారు.. అయినా నేను భయపడలేదు. ఎందుకంటే ఉద్యమంలో కూడా రోడ్ల మీదే ఉండి పోరాటం చేశాం.. మళ్లీ తెలంగాణ ప్రజల కోసం రోడ్లపై ఉండి పోరాటం చేస్తాను’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kavitha) స్పష్టం చేశారు. ఓట్లు ఉన్నప్పుడే పార్టీల నాయకులు వస్తారని, కానీ ఓట్లు లేనప్పుడు కూడా జాగృతి ప్రజలతోనే ఉంటుందని తెలిపారు. జాగృతి జనంబాటలో భాగంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో పర్యటించారు.
కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి దారుణం
ఉప్పల్ భగాయత్ వద్ద నిర్మిస్తున్న సివరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను, ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ఎన్నో కలలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొన్ని పనులు జరిగితే, కాంగ్రెస్ వచ్చాక పరిస్థితి దారుణంగా తయారైందని ఆరోపించారు. పెన్షన్ పెంచుతారని ఓటు వేస్తే ఉన్నవే వచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. రేషన్ కార్డులు సైతం ఇచ్చే పరిస్థితి లేదని వీటిని అడిగే వాళ్లు కచ్చితంగా ఉండాలని, అడిగేట్లోళ్లు ఉంటేనే సమస్యలు తీరుతాయన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ మన పరిస్థితి మాత్రం మారడం లేదన్నారు. ఇప్పుడు ఏ ఎన్నికలు లేవని, మన సమస్యల కోసమే మేము తిరుగుతున్నామన్నారు. ఆ అడిగే పనిని తాను తీసుకున్నానని, ఇది ఓట్ల పోరాటం కాదని, సీట్ల కోసం ఆరాటం కాదని స్పష్టం చేశారు.
Also Read: Kavitha: జాగృతి యాత్రలో కీలక మార్పులు.. సర్పంచ్ ఎన్నికల కోడ్ ఎఫెక్ట్!
ఎస్టీపీని ఎందుకు నిర్మిస్తున్నారు?
వేరే చోట శాంక్షన్ అయిన ఎస్టీపీ ని ఉప్పల్ భగాయత్ వద్ద ఎందుకు నిర్మిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పనులు ఆపాలని మహిళలు అడిగితే వారిని నాలుగు పోలీస్ స్టేషన్ల చుట్టు తిప్పడం అన్యాయమని, డీజీపీ ఘటనపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. భగాయత్‌లో నాలుగు ఎకరాల ఖాళీ స్థలం ఉందని ఓపెన్ జిమ్, పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల ఆమోదంతోనే మూసీ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ ఫ్లై ఓవర్‌ను 14 ఏళ్లుగా నిర్మిస్తూనే ఉన్నారని, ప్రభుత్వాలు మారుతున్నాయి. కానీ, ఉప్పల్ ప్రజల పరిస్థితి మారడం లేదన్నారు. 14 ఏళ్లుగా నిర్మిస్తున్నారంటే ప్రజలపై ప్రభుత్వాలకు ఏమాత్రం చిత్తశుద్ది ఉందో తెలుస్తోందన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పనులు పూర్తి చేయించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని లేదంటే జాగృతి తరఫున తామే ప్రభుత్వం వెంట పడి పనులు చేయిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Kavitha: నిరంజన్ రెడ్డి పుచ్చ లేచిపోద్ది.. మాజీ మంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కవిత

