Rangareddy Politics: రంగారెడ్డి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విచిత్రమైన రాజకీయ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. పార్టీ గుర్తులు లేని ఈ స్థానిక సమరంలో జిల్లా, మండల స్థాయి నాయకులు తమ సత్తా చాటుకోవడానికి, పంతం నెగ్గించుకోవడానికి సిద్ధాంతాలు, విలువలకు తిలోదకాలిచ్చి ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో ఒకే పార్టీ వ్యక్తులు అయినప్పటికీ, రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నప్పుడు తమ అనుచరులను బరిలో పెట్టి బల నిరూపణకు నాయకులు సిద్ధమవుతున్నారు. సర్పంచ్ అభ్యర్థితో పాటు వార్డుల వారీగా ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒకే పార్టీలో ఆశావాహులు అత్యధికంగా ఉండటంతో వర్గాల వారీగా విడిపోయి నామినేషన్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల, బలమైన అభ్యర్థులు రేసులో ఉంటే పార్టీలతో సంబంధం లేకుండా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులతో అవగాహన కుదుర్చుకుని ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితులపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు దృష్టి పెడుతున్నప్పటికీ, కొంతమంది నేతలు వీటిని సీరియస్‌గా తీసుకోకుండా తమకు అనుకూలంగా లేని వ్యక్తులపై బహిరంగంగానే విమర్శలు చేయడం గమనార్హం.
Also Read: RangaReddy News: చనిపోతాం తప్ప భూములు ఇచ్చేది లేదు.. ఎన్కెపల్లిలో గ్రామస్తుల ఆందోళన!
గ్రామాభివృద్ధి కోసం ఒక్కతాటిపైకి!
మొదటి, రెండో విడుతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. కొన్ని చోట్ల అభ్యర్థులు అభ్యర్థన మేరకు వెనక్కి తగ్గగా, మరికొన్ని చోట్ల పార్టీలతో సంబంధం లేకుండా గ్రామాభివృద్ధి కోసం ఒక్కటై ముందుకు వెళ్తున్నారు. అయితే, కొన్ని గ్రామాల్లో శత్రు పార్టీలుగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత బలనిరూపణ కోసం సిద్ధాంతాలు, విలువలన్నింటినీ పక్కకు పెట్టి రాజకీయం చేయడం విశేషం. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి పార్టీలు మాట్లాడే విలువలు, ఆరోపణలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయిలో నేతలు కలిసి పోటీ చేయడం జరుగుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ అవకాశాలు రానీ నేతలు, పార్టీ కోసం శ్రమించే నాయకులు ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని వ్యూహాలు పన్నుతున్నారు. ఇక్కడ పార్టీ కట్టుబాట్లు, నిబంధనలు, సస్పెన్షన్లు ఉండవు. ఎవరికి వారే యమునా తీరుగా వ్యవహరిస్తున్నారు.
లీడర్‌కు దగ్గరయ్యే ప్రయత్నం
పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల సంఖ్యను అత్యధిక స్థాయిలో మండలంలోని గ్రామాలను గెలిపించే నాయకులే అధిష్టానం వద్ద మెప్పు పొందే అవకాశం ఉంటుంది. అందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలు లీడర్‌కు దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకే పార్టీలో ఇద్దరు, ముగ్గురు మండల నాయకులు అధినాయకుడి వద్ద బలాన్ని నిరూపించుకోవాలంటే, ఈ స్థానిక సమరమే ఏకైక ఆధారం. అందులో భాగంగానే ఆ మండల స్థాయి నేతలు పార్టీలతో సంబంధం లేకుండా తమకు అప్పగించిన గ్రామాల్లో అభ్యర్థులను గెలిపించుకోవడానికి అన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్తున్నారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
Also Read: Albert Einstein: ఐన్ స్టీన్ మెదడు 240 ముక్కలుగా ఎందుకు కట్ చేశారో తెలుసా ?

