– హైకోర్టులో కేసీఆర్‌కు చుక్కెదురు
– పవర్ కమిషన్‌ను రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టివేత
– కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ లాయర్ వాదనలు
– నిబంధనల మేరకే అంతా జరుగుతోందన్న అడ్వకేట్ జనరల్
– ఏజీ వాదనతో ఏకీభవించిన సీజే ధర్మాసనం
– విచారణ కొనసాగించవచ్చని న్యాయమూర్తి స్పష్టత
– కేసీఆర్ ఏం చేయనున్నారు? కమిషన్ ఏం చేయబోతోంది?
KCR: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలులో జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్ నర్సింహా రెడ్డి కమిషన్‌కి వ్యతిరేకంగా కేసీఆర్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ అర్హతపై తెలంగాణ హైకోర్టు సోమవారం కీలక తీర్పునిచ్చింది. విచారణ అనంతరం కేసీఆర్ పిటిషన్‌ను కొట్టేసింది. ఎల్ నర్సింహా రెడ్డి కమిషన్ రద్దు చేయాలన్న ప్రతిపాదనను తిరస్కరించింది. జస్టిస్ నర్సింహారెడ్డిని ప్రతివాదిగా చేర్చడంపై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం తెలిపింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరఫు న్యాయవాదులతో హైకోర్టు విభేదించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది.
హైకోర్టులో సవాల్ చేసిన కేసీఆర్
విద్యుత్ కొనుగోలు అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు రద్దు కోరుతూ కేసీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, కేసీఆర్ పిటిషన్ కొట్టేసింది. గత శుక్రవారం ఈ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. సోమవారం హైకోర్టు తీర్పును వెలువరించింది. విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా అవకతవకలు జరగలేదని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటైందని కేసీఆర్ తరఫు న్యాయవాది ఆదిత్య సోందీ వాదించారు.
కేసీఆర్ విచారణకు వెళ్తారా?
కేసీఆర్ పిటిషన్‌పై విచారణ అర్హత లేదని అడ్వకేట్ జనరల్ వాదించారు. దీనికి న్యాయస్థానం ఏకీభవించింది. విద్యుత్ కమిషన్ విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణ ఊపందుకోనుంది. ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు, పాత టెక్నాలజీ వినియోగం, టెండర్ పద్దతిన కాకుండా నామినేషన్ బేస్డ్ కాంట్రాక్టులు కేటాయించినట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఏం జరగనుందనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు కేసీఆర్ విచారణకు వెళ్తారా లేదా? కమిషన్ ఎవరెవరిని విచారణకు పిలుస్తుంది అనేది హాట్ టాపిక్‌గా మారింది.