Tollywood Heroines: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఎవరికీ శాశ్వతం కాదు. ఒక ఏడాది తిరుగులేని స్టార్‌డమ్‌ను అందుకున్న హీరోయిన్, మరుసటి ఏడాదే ఒక్క హిట్ కూడా పడక డౌన్ అయిపోవడం గమనిస్తుంటాం. తొలి సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్లు కూడా ఉన్నారు. కాబట్టి.. సక్సెస్ ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టం. కానీ కంటెంట్‌ని నమ్ముకుంటే మాత్రం కచ్చితంగా ఏదో ఒక రూపంలో సక్సెస్ అయితే వచ్చి తీరుతుంది. కంటెంట్, టాలెంట్‌తో పాటు కొద్దిగా అదృష్టం తోడయితేనే ఇక్కడ రాణించగలరు. లేదంటే, ఎంత త్వరగా వచ్చారో.. అంతే త్వరగా చాప చుట్టేస్తారు. ఇటీవల కాలంలో, ఒకటి రెండు మంచి సినిమాలు పడినప్పటికీ ఆ తర్వాత కోలుకోలేని విధంగా వరుస పరాజయాల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్న హీరోయిన్లు చాలానే ఉన్నారు. అందులో టాప్ 5ని గమనిస్తే..
1. శ్రీలీల (Sreeleela)
ఒకప్పుడు టాలీవుడ్‌లో ‘లక్కీ చార్మ్’గా పిలవబడిన శ్రీలీల వరస అవకాశాలతో అందరికీ షాకచ్చింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. వరుస పరాజయాలతో దుకాణం సర్దేసే పరిస్థితికి చేరుకుంది. ఈ భామ నటించిన ‘ఆదికేశవ, స్కంద, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, రాబిన్‌హుడ్, జూనియర్’తో పాటు ఇటీవల వచ్చిన ‘మాస్ జాతర’ (Mass Jathara) వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. తన డ్యాన్స్ టాలెంట్‌తో ఎలాగోలా నెట్టుకొస్తుంది కానీ, ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె కెరీర్ ఏమంత గొప్పగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’పైనే ఉన్నాయి. ఈ సినిమా 2026 ఏప్రిల్‌లో విడుదల కానుంది.
Also Read- Mythri Movie Makers: ఇళయరాజాతో ఇష్యూ.. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతకి సెటిల్ చేసుకున్నారంటే?
2. భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)
టాలీవుడ్ లేటెస్ట్ సంచలనంగా పేరొందిన భాగ్యశ్రీ బోర్సే తన గ్లామర్‌తో అవకాశాలనైతే పట్టేస్తుంది కానీ, సక్సెస్ మాత్రం ఆమెకు అందని ద్రాక్షగానే మారింది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తొలి సినిమాతోనే దారుణ పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత చేసిన ‘కింగ్‌డమ్’, ‘కాంత’ కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చిన రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీలో భాగ్యశ్రీనే హీరోయిన్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా, కలెక్షన్ల పరంగా దారుణంగా ఉందని తెలుస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘ఆంధ్ర కింగ్ తాలుకా’ విషయంలో ‘ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డెడ్’ అన్న పరిస్థితి నెలకొంది. ఆమె చేసిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడటంతో, ఈ భామను బుక్ చేసుకోవడానికి కూడా దర్శకనిర్మాతలు భయపడుతున్నారు.
3. పూజా హెగ్డే (Pooja Hegde)
దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరుగా పేరొందిన పూజా హెగ్డే మార్కెట్ విలువ ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ఆమె నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్, సర్కస్, రెట్రో’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు అన్నీ నిరాశపరిచాయి. వీటి మధ్యలో గెస్ట్ అప్పీరియెన్స్ ఇచ్చిన ‘ఎఫ్ 2’ విజయం సాధిస్తే.. ‘కూలీ’ పరవాలేదనిపించుకుంది. ప్రస్తుతం తెలుగులో దుల్కర్ సరసన ఒక సినిమా చేస్తున్న పూజా.. తమిళ్‌లో మాత్రం విజయ్ చివరి చిత్రం ‘జననాయగన్’లో చేసే అవకాశాన్ని పట్టేసింది. ఈ రెండింటిలో ఏదో ఒకటి హిట్ అయితేనే పూజా ఇంకొంత కాలం నెట్టుకొస్తుంది. లేదంటే తట్టా బుట్టా సర్దేసుకోవడమే.
Also Read- Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీలో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?
4. కృతి శెట్టి (Krithi Shetty)
‘ఉప్పెన’తో కృతి శెట్టికి అద్భుతమైన ఆరంభం, విజయం లభించింది. ఆ తర్వాత చేసిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ కూడా మంచి సక్సెస్‌నే అందుకున్నాయి. ఇక ఆ చిత్రాల తర్వాతే కృతి శెట్టికి పరాజయాలు మొదలయ్యాయి. ‘మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్, కస్టడీ, మనమే’ ఇలా వరసగా ఆమె చేసిన సినిమాలన్నీ పరాజయం పాలయ్యాయి. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలే లేకుండా పోయాయి. ప్రస్తుతం కార్తితో చేసిన తమిళ చిత్రం ‘వా వాతియార్’ తెలుగులో ‘అన్నగారు వస్తున్నారు’గా విడుదల కాబోతోంది. ఈ సినిమా ఏమైనా విజయం సాధిస్తే.. మళ్లీ ఈ భామ పేరు వినిపించే అవకాశం ఉంది.
5. కేతికా శర్మ (Ketika Sharma)
ఈ భామ పరిస్థితి మరీ దారుణం. ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ లేకపోవడం విడ్డూరమనే చెప్పుకోవాలి. సోషల్ మీడియాలో మంచి ప్రమోషనల్ బజ్, ఆకర్షణ ఉన్నప్పటికీ, కేతిక శర్మ ఆ క్రేజ్‌ను బాక్సాఫీస్ విజయంగా మలుచుకోలేకపోతుంది. ఆమె నటించిన ‘రొమాంటిక్, లక్ష్య, రంగ రంగ వైభవంగా’ వంటి చిత్రాలన్నీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమయ్యాయి. ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే తక్షణమే ఒక కమర్షియల్ హిట్ అవసరం. చూద్దాం.. అది ఎప్పటికి వస్తుందో.
ఈ ఐదుగురు మాత్రమే కాదు.. ఇంకొందరు హీరోయిన్లు కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. వారందరికీ సాలిడ్ హిట్ పడితేనే మళ్లీ టాలీవుడ్‌లో చక్రం తిప్పగలరు. లేదంటే, కొత్తగా వచ్చే వారు వాళ్లని రీప్లేస్ చేస్తారని చెప్పుకోవడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
