HILT Policy: హిల్ట్ పాలసీపై న్యాయపోరాటం
ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
కుంభకోణంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాం
ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతాం
భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగింపు
మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీది రద్దు చేస్తాం: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ (HILT Policy) పేరుతో రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణానికి పాల్పడుతున్నదని, ఆ పాలసీపై న్యాయపోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో గురువారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి ఆయన పర్యటించారు. కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌లో హమాలీలతో మాట్లాడారు. అనంతరం పారిశ్రామిక ప్రాంతాల్లోని ప్రజలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తుందని మండిపడ్డారు.
Read Also- Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీలో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?
పరిశ్రమలు వద్దు అంటూ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నదన్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేటు వ్యక్తుల భూములు కావు.. ప్రైవేట్ వ్యక్తులకు ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన భూములు అన్నారు. అందులో కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందన్నారు. లక్షన్నర రూపాయలకు గజం ధర మార్కెట్లో పలుకుతుంటే కేవలం 4000 రూపాయలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తున్నదన్నారు. హైదరాబాద్ లో ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి స్మశానాలకు స్థలం లేదు కానీ ప్రైవేట్ వ్యక్తులకు 9300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటున్నదని మండిపడ్డారు. భూములను తిరిగి వెనక్కి తీసుకొని అక్కడ కాంగ్రెస్ చెప్తున్నా ఇందిరమ్మ ఇండ్లు యంగ్ ఇండియా స్కూల్స్ ఆసుపత్రులు నిర్మించాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఉన్న కంపెనీలు తరలి వెళ్తే హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజల కి వివరించేందుకే పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిర్ధారణ జరగాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామని వెల్లడించారు.ఈ అంశాన్ని ఇక్కడితో మా పార్టీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హిల్ట్ పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తామని, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా సంఘాలు ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతామని వెల్లడించారు.
ఈ పాలసీని వెనక్కి తీసుకొని లక్షల కోట్ల ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీది రద్దు చేస్తాము.. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తామని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలు బయటకి పంపించాలన్నది అందరి ఉద్దేశం అని, అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మసిటీని ఏర్పాటు చేశామన్నారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు ,వివేకానంద గౌడ్,పల్లా రాజేశ్వర్ రెడ్డి,ఎమ్మెల్సీ శాంబీపూర్ రాజు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
