Teenmar Mallanna Office: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ముందు (Teenmar Mallanna Office) గురువారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. దీంతో, ఒక్క క్షణంలోనే మంటలు ఆ యువకుడిని చుట్టుముట్టాయి. విషయాన్ని గుర్తించిన చుట్టుపక్కల స్థానికులు, వెంటనే మంటలు ఆర్పివేశారు. అనంతరం బాధిత యువకుడిని సిటీలోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. తీవ్రమైన కాలిన గాయాలు కావడంతో ప్రస్తుతం యువకుడి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం.
కారణం ఇదేనా?
తీర్మార్ మల్లన్న కార్యాలయం ముందు ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడి పేరు సాయి అని గుర్తించారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని, తీన్మార్ మల్లన్నను కలవడానికి వచ్చానని ఆఫీస్ సిబ్బందితో ఆ యువకుడు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, మల్లన్న ప్రస్తుతం ఆఫీసులో లేరంటూ బయటకు వెళ్లిన అతడు, ఆ కొద్దిసేపటికే ఈ చర్యకు పాల్పడినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
