Sritej Health: అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ (Pushpa 2: The Rule) సినిమా ప్రీమియర్ నిమిత్తం సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన (Sandhya Theater Stampade).. ఆ సినిమా ఎంత పెద్ద సక్సెస్ సాధించినా, అల్లు అర్జున్ అండ్ టీమ్‌కు మాత్రం ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. ఈ తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ ఘటన తర్వాత కేసులు నమోదవడం, అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం, బెయిల్‌పై బయటకు రావడం వంటి విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఈ ఘటనలో శ్రీతేజ్ ఫ్యామిలీకి రూ. 2 కోట్ల ఆర్థిక సాయాన్ని హీరో, దర్శకుడు, నిర్మాతలు కలిసి అందజేశారు. ఈ ఘటన సరిగ్గా సంవత్సరం క్రితం డిసెంబర్ 4న జరిగింది. ప్రస్తుతం శ్రీతేజ్ హెల్త్ పరిస్థితికి సంబంధించి మళ్లీ వార్తలు హైలెట్ అవుతున్నాయి. శ్రీతేజ్ ఫ్యామిలీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అల్లు అర్జున్ అండ్ టీమ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
అల్లు అర్జున్ మేనేజర్ స్పందించడం లేదు
ఈ ఇంటర్వ్యూలో శ్రీతేజ్ తండ్రి భాస్కర్ (Sritej Father Bhaskar) మాట్లాడుతూ.. ‘‘ఆ రోజు జరిగిన తొక్కిసలాటలో నా భార్య చనిపోవడంతో.. జరగరాని నష్టం జరిగిందని తలంచి.. అల్లు అర్జున్ కుటుంబం నా పిల్లల పేరుమీద రూ.2 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ మొత్తానికి నెల నెలా బ్యాంకు వడ్డీ తీసుకునే అవకాశం కల్పించారు. కానీ.. ఆ వడ్డీ డబ్బులు.. బాబు వైద్య చికిత్స ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. నెలకు రూ.2 లక్షల ఖర్చుకు తోడు జూన్‌లో బాబు కాళ్లకు ఆపరేషన్ చేయించినప్పుడు అదనంగా రూ.3 లక్షలు ఖర్చయ్యాయి. బాబుకు సపర్యలు చేసేందుకు, చికిత్స చేయించేందుకు ఎవరూ లేకపోవడంతో.. ఉద్యోగం మానేసి నేనే చూసుకుంటున్నాను. శ్రీతేజ్ ఆస్పత్రిలో ఉన్న సమయంలో అతడు పూర్తిగా కోలుకునే వరకు తమదే బాధ్యత అని, వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ భర్తిస్తామని అల్లు అర్జున్ కుటుంబం హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని అల్లు అర్జున్‌కు గుర్తు చేసేందుకు ఆయన మేనేజర్‌ను సంప్రదిస్తుంటే.. ఆయన స్పందించడం లేదు. దయచేసి నా కుమారుడి థెరపీకి అయ్యే ఖర్చుకైనా సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Bigg Boss First Finalist: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరు? రేసులో ఆ నలుగురు?
పొత్తిళ్లలో పసిబిడ్డలా
శ్రీతేజ్ బాబాయి మల్లికార్జున మాట్లాడుతూ.. ‘‘శ్రీతేజ్ కాళ్లకు ఆపరేషన్, ఇప్పటివరకు అయిన థెరపీలకు రూ.20 లక్షలు చెల్లించాం. శ్రీతేజ్‌కు థెరపీలు, మందులు, డైపర్లు, ప్రత్యేకమైన ఆహారం వంటివన్నీ కలిపి నెలకు దాదాపు రూ.1.25 లక్షలకు పైన ఖర్చు అవుతుంది. ఇక ఇంటి అద్దెతోపాటు పాప చదువుకు, మా అమ్మ మందులకు అయ్యేదంతా అదనం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీతేజ్ విషయానికి వస్తే.. ఘటన జరిగి ఏడాది అవుతున్నా, ఆ పిల్లాడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది. ఆరు నెలల కిందట హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయితే చేశారు కానీ, ఇప్పుడు ఇల్లే పెద్ద దవాఖానాగా మారిందని, తండ్రే నర్సుగా మారి అన్ని సపర్యలు చేస్తున్నారు. ఒంటినిండా ట్యూబులతో ఉన్న తన కుమారుడిని తండ్రి భాస్కర్ పొత్తిళ్లలో పసిబిడ్డలా చూసుకుంటున్నారు. మరి ఇది తెలిసిన తర్వాతైనా అల్లు అర్జున్.. తను ఇచ్చిన మాటపై నిలబడతాడేమో చూద్దాం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
