Minister Damodara: రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ విస్తరణకు కసరత్తు మొదలు పెట్టింది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందిన సీఎం రేవంత్ రెడ్డి.. రాష్ట్ర గవర్నర్‌తోనూ ఈ విషయంపై భేటీ అయ్యారు. అయితే.. ఈ విస్తరణలో మంత్రిపదవులు ఎవరికి దక్కుతాయా? అనే ఆసక్తి ఏర్పడింది. పారాచూట్ నేతలకు బెర్త్ లభించదని గతంలో కాంగ్రెస్ నేతలు చెప్పడంతో బెర్త్ ఎవరికి దక్కుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. తాజాగా, మీడియాతో చిట్ చాట్ చేస్తూ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ సస్పెన్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు.
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, శాఖల మార్పులు చేర్పులు ఉంటాయని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. సీతక్కకు హోం మంత్రిగా బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉన్నదని వెల్లడించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్‌లకు కేబినెట్‌లో స్థానం దక్కుతుందని చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని వివరించారు. ముందుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు మంత్రి పదవి ఇవ్వబోమని చెప్పామని గుర్తు చేస్తూ ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా నిర్ణయాలు జరిగాయని పేర్కొన్నారు.
జాతీయ వైద్యుల దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన మంత్రి దామోదర.. బీఎస్ రాయ్ గురించి మాట్లాడారు. బీఎస్ రాయ్ జన్మదినాన్నే డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నట్టు చెప్పారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డాక్టర్స్ అవార్డు ప్రతి ఏడాది ఇస్తామని తెలిపారు. జూడాల సమ్మె సమయంలో వారి సమస్యలను 80 శాతం పరిష్కరించామని వివరించారు.
ఉస్మానియా హాస్టల్ బిల్డింగ్ లేదని, పది రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్తాపన చేస్తామని, రెండేళ్లలో హాస్టళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. మౌలికసదుపాయాలతోపాటు మానవవనరులు కూడా ముఖ్యమని, ప్రస్తుతం హెచ్ఆర్‌లో ఇంబ్యాలెన్స్ ఉందని పేర్కొన్నారు. త్వరలోనే ప్రక్షాళన చేసి సరి చేస్తామని, అదనపు సదుపాయాలతో క్వాలిటీ మెయింటెయిన్ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా ఇది నా హాస్పిటల్ అనుకునేలా తీర్చిదిద్దుతామని తెలిపారు.
24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదని, సేవలు ఎలా అందిస్తున్నామనేదే ముఖ్యమని మంత్రి దామోదర చెప్పారు. టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణాలు కొనసాగుతాయని తెలిపారు. 13 అంతస్తుల నిబంధర ఉన్నది, తాము దాన్ని పాటిస్తామని వివరించారు. నిలోఫర్, ఎంఎన్‌జేలకు ఒక ప్రత్యేకత ఉన్నదని, ఇతర హాస్పిటళ్లకు కూడా ప్రత్యేకత ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే హెచ్ఓడీల ప్రక్షాళన జరుగుతున్నదని, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటామని, వారితో సరిగ్గా పని చేయిస్తామని వివరించారు. ఉస్మానియా హాస్పిటల్ పరిశీలనకు సెక్రెటరీని పంపిస్తే అసలు హెచ్ఓడీలే లేరని, ఇంచార్జీలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని చెప్పినట్టు తెలిపారు.