Telangana Govt: తెలంగాణ మహిళలు ప్రపంచ పారిశ్రామికవేత్తలతో పోటీ పడాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో వివిధ పథకాలు, అభ్యుదయ విధానాలను అమలు చేస్తున్నది. రెండేండ్లలోనే మహిళల సాధికారిత దిశగా దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలబడింది. మహిళా స్వావలంబనతో పాటు మహిళల రక్షణ, ఆర్థిక భద్రతకు ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమివ్వడమే ఇందుకు కారణం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పేరుతో మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించారు.
రెండేండ్లుగా ఈ ఉచిత ప్రయాణ సదుపాయం మహిళల ఆదరణను చూరగొన్నది. రోజూ లక్షలాది మంది తెలంగాణ ఆడబిడ్డలు చదువుల కోసం, పనుల మీద ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా జీరో టికెట్‌పై ప్రయాణం చేస్తున్నారు. ఛార్జీలపై ఆదా చేసుకున్న సొమ్మును ఇతర ఖర్చులకు సర్దుబాటు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మహిళలు రూ.7,600 కోట్లు ఆదా చేసుకున్నారు. రోజుకు దాదాపు 30 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జీరో టికెట్లపై ప్రయాణిస్తున్నారు. రెండో ప్రాధాన్యతగా ఇంటి ఆడబిడ్డలకు ఖర్చు తగ్గించే ఉద్దేశంతో సబ్సిడీపై 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ను అందిస్తున్నది. దీనివల్ల దాదాపు 45 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
ఆర్థికంగా నిలదొక్కుకునేలా
ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా స్వయం కృషితో ఎదిగే మహిళలకు రుణాలు అందించడం ద్వారా స్వయం సహాయక గ్రూపులు ఆర్థికంగా తమ కాళ్ల మీద తామే నిలబడేలా సర్కారు సహకారం అందిస్తున్నది. అందుకే మునుపెన్నడూ లేని విధంగా నేడు తెలంగాణ మహిళలు సొంతంగా ఆర్టీసీకే బస్సులను అద్దె కివ్వడంతో పాటు పెట్రోల్ బంకులను కూడా నడిపే స్థాయికి ఎదిగారు. ఇందిరా జీవిత బీమా పథకం, ఇందిరా రుణ బీమా పథకం, శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు, ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, సోలార్ విద్యుత్ కేంద్రాలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, భద్రత కోసం టీ సేఫ్ లాంటి సౌకర్యాలను ఈ రెండేళ్లలో ప్రభుత్వం తెచ్చింది. తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీని అమలులోకి తెచ్చింది. గ్రామీణ, పట్టణ మహిళలు, యువతులను ఒకే గొడుగు కిందకు తెచ్చి వారికి ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించాలనే లక్ష్యంతో వినూత్న నిర్ణయాలు తీసుకున్నది.
వేర్వేరుగా సెర్ప్.. మెప్మా
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇందిరా మహిళా శక్తి సంఘాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధ్వర్యంలో, పట్టణాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలో ఉండేవి. వేర్వేరు సంస్థల పరిధిలో ఉండడంతో ఉమ్మడి పథకాల అమలుకు ఇబ్బందులున్నాయని ప్రభుత్వం గుర్తించింది. గ్రామాల్లోని సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారు పట్టణాలకు వలస వచ్చినప్పుడు వారికి పథకాలు అందడం లేదు. మరోవైపు, చాలా గ్రామాలు పక్కన ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమయ్యాయి. ఇప్పటికే సెర్ప్ పరిధిలోని 33,914 సంఘాలు మెప్మా పరిధిలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో మెప్మా వేరు సెర్ప్ వేరుగా కాకుండా సంఘాలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ప్రజా ప్రభుత్వం కొత్త పాలసీని అమలులోకి తెచ్చింది. అంతేగాక మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ.26 వేల కోట్ల రుణాలను పంపిణీ చేసింది. కొత్తగా 2,25,110 సంఘాలు రూ.4,825.54 కోట్ల వ్యాపారాలను ప్రారంభించాయి. రాష్ట్రంలో 22 జిల్లాల్లో జిల్లా సమాఖ్యలకు ఇందిరా మహిళా శక్తి భవనాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
క్యాంటీన్లు, ఇతర స్వయం ఉపాధి కేంద్రాలు
సెక్రెటేరియట్‌తో పాటు జిల్లా కలెక్టరేట్లు, ప్రభుత్వ ఆఫీసులు, కోర్టులు, కాలేజీలు, హాస్పిటళ్లు, ఆలయాలు, టూరిస్ట్ ప్రాంతాలు న్యాయస్థానాలు, కళాశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో 214 ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఐటీ హబ్, మాదాపూర్‌లో మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేసింది. రూ.9 కోట్లతో 106 దుకాణాల సముదాయాన్ని నిర్మించి సంఘాలకు కేటాయించింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే పనులను అప్పగించింది. ఈ కుట్టు కూలీ ఛార్జీలతో రూ.30 కోట్ల ఆదాయం సంఘాలకు సమకూరింది. పాఠశాలల నిర్వహణ, నిర్మాణ పనులను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించింది. రూ.554 కోట్ల విలువైన పనులు ఇచ్చింది. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యశాఖ ద్వారా 32 జిల్లాల్లో మొబైల్ ఫిష్ అవుట్ లెట్లను ప్రారంభించింది.
రూ.54 కోట్లతో 600 బస్సులను కొనుగోలు
రూ.10 లక్షల విలువైన వాహనాలను 60 శాతం సబ్సిడీతో అందజేసింది. ప్రమాదానికి గురైన స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు చెందిన కుటుంబాలకు రూ.10 లక్షల ప్రమాద బీమాను అందించింది. కొన్ని కుటుంబాలకు రూ.2 లక్షల రుణ బీమాను చెల్లించింది. నారాయణపేట, సంగారెడ్డిలో జిల్లా సమాఖ్యలు పెట్రోలు బంక్‌లు నిర్వహించి లాభాల బాటలో నడుస్తున్నాయి. 32 జిల్లాలలో 64 మెగా మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నది. మహిళా సమాఖ్యల వద్ద ఉన్న రూ.54 కోట్లతో 600 బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకివ్వాలని నిర్ణయించింది. ఇటీవలే 17 జిల్లాల్లో సమాఖ్యల ఆధ్వర్యంలో 151 బస్సులను కొన్నారు. ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో మహిళా సంఘాలు బస్సులకు ఓనర్లయ్యారు. ఆర్థిక సాధికారత కోసం మరో 449 బస్సులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read: Telangana Govt: మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట.. గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా నిధుల పెంపు!
