Pawan – Komatireddy: కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందంటూ ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన పలువురు నేత.. పవన్ వ్యాఖ్యాలను తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) పవన్ పై ఘాటుగా స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘పవన్ వ్యాఖ్యలు సరికాదు’
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 60 ఏళ్ల పాటు తెలంగాణ బిడ్డలు బాధలు అనుభవించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఫ్లోరైడ్ నీరు తాగి బతికామని అన్నారు. తమ నిధులు, నీళ్లు, ఉద్యోగాలను ఏపీ వాళ్లు తీసుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు వచ్చిన పైసలతో విజయవాడ, వైజాగ్ లను అభివృద్ధి చేసుకున్నారని మండిపడ్డారు. ‘పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. మంచి చేయాలని ఉదేశంతో వచ్చి ఉంటారు. కానీ ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.
‘సినిమాలు ఆడనివ్వం’
పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి చాలా మంచి వ్యక్తి అని ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలను ఆయన చేయరని పేర్కొన్నారు. ‘పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్తే నైజాంలో రెండు రోజులైనా సినిమాలు ఆడుతాయి. లేదంటే సినిమా నడువదు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇది చెప్తున్నా. ఇప్పటికి 13ఏళ్లు అయింది తెలంగాణ వచ్చి. ప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు అనవసరం. తెలంగాణ బిడ్డలు బాధపడుతున్నారు’ అని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.
‘రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం’
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసి వెళ్లిపోయారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఆ అప్పులు కడుతూ ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణపై తన వ్యాఖ్యలతో పవన్ దాడి చేయడం సరికాదన్నారు. కాబట్టి పవన్ తక్షణమే క్షమాపణలు చెప్పి.. ఈ వివాదానికి ముగింపు పలకాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్య?.. పాక్‌లో హైటెన్షన్.. 144 సెక్షన్ విధింపు
పవన్ ఏమన్నారంటే?
ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ప్రాంతానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగిలిందని అన్నారు. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి పచ్చదనమే కారణమని అన్నారు. తెలంగాణ నాయకులు అంటుంటారు. గోదావరి జిల్లాలు పచ్చదనంతో చాలా బాగుంటుంది. కొబ్బరి చెట్లతో చాలా హాయిగా ఉంటుందని అంటుంటారు. ఇవాళ చూస్తే కొబ్బరి చెట్టు మెుండాలు కూడా లేవు. కోనసీమకు అంత దిష్టి తగిలింది’ అని పవన్ వ్యాఖ్యానించారు. కోనసీమను ఇలా చూస్తుంటే తనకు నిజంగా చాలా బాధ వేస్తోందని పవన్ పేర్కొన్నారు. నరుడి దిష్టికి నల్లరాయి అయినా బద్దలు కావాల్సిందేనని పవన్ చెప్పుకొచ్చారు.
