Telangana Fishermens: రాష్ట్రంలో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిసి, చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉన్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వం చేపపిల్లల పంపిణీ లక్ష్యాన్ని చేరడంలో తీవ్రంగా విఫలమైంది. చేపపిల్లలు పెరగడానికి ఏడాది కాలం పడుతున్న నేపథ్యంలో, పంపిణీలో జరుగుతున్న ఈ జాప్యం 4.21 లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధిపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. నవంబర్ చివరిలోగా పంపిణీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, 84.62 కోట్ల చేపపిల్లల లక్ష్యంలో కేవలం 18% మాత్రమే నీటి వనరుల్లో వేశారని అధికారిక లెక్కలే చెబుతున్నాయి. ఇది అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని మత్స్యకార సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రణాళికలేవీ?
రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మొత్తం 26,324 చెరువులు, కుంటలు, ప్రాజెక్టులలో చేపపిల్లలను పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ పథకం కోసం రూ.93.62 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. నిర్ణీత లక్ష్యం 84.62 కోట్ల చేపపిల్లలు (రూ. 93.62 కోట్లతో) కాగా, కేవలం 4,500 చెరువులు, కుంటల్లో మాత్రమే పంపిణీ జరిగింది. అంటే సుమారు 18% మాత్రమే. ఇక తొలిసారిగా రూ.28.60 కోట్లతో 10 కోట్ల రొయ్య పిల్లలను 300 నీటి వనరులలో పంపిణీ చేయాలని భావించినా, ఆ లక్ష్యంపై స్పష్టత లేదు. అధికారుల సరైన ప్రణాళికలు లేకపోవడం వల్లే పంపిణీలో జాప్యం జరుగుతోందని మత్స్యకార సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Also Read: Fisheries Department: మేడ్చల్‌లో రూ.5.85 కోట్లతో భవనాల నిర్మాణం.. పట్టించుకోని ప్రభుత్వ అధికారులు!
నీరు అడుగంటే ప్రమాదం
ఈ ఏడాది జూన్ నుంచే భారీ వర్షాలు కురిశాయి. చెరువులు, కుంటలతో పాటు ప్రాజెక్టుల్లోనూ భారీగా వరద నీరు చేరింది. దానిని బట్టి చేపపిల్లలను పోయాలని ప్రభుత్వం భావించింది. చేపల పంపిణీ ఆలస్యం కావడంతో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఉన్న నీరు మరో నాలుగైదు నెలలు మాత్రమే ఉండే అవకాశం ఉంది. చేప పిల్లలు పెరిగి పెద్దవి కావడానికి కనీసం ఏడాది పడుతుంది. ఈ తరుణంలో ఎప్పటివరకు పోస్తారు? పోస్తే అవి పెరిగేదెప్పుడు? అనేది ఇప్పడు ప్రశ్నార్ధకంగా మారింది. వేసవి కాలంలో నీటి వనరులు అడుగంటే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, చేప పిల్లలు పెరిగేలోపే నీరు ఇంకిపోతే, మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా ఎలా ఆదుకుంటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
నిర్లక్ష్యంపై విమర్శలు
మత్స్యకార కార్పొరేషన్‌కు మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తి ఛైర్మన్‌గా ఉన్నప్పటికీ, ఈ విషయంలో చొరవ చూపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో 6,152 మత్స్యకార సంఘాల్లోని 4.21 లక్షల మంది మత్స్యకారుల జీవనోపాధి ఈ చెరువులపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికే ప్రారంభమైన కార్యక్రమం కాబట్టి ప్రత్యేక అనుమతి తీసుకొని పంపిణీ చేసే అవకాశం ఉందని సమాచారం. అయినప్పటికీ అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగిలిన నీటి వనరుల్లో పంపిణీకి చర్యలు చేపట్టాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Vakiti Srihari: ప్రకృతి వైపరీత్యాల్లో మూగజీవాలకు.. రక్షణ విధివిధానాలు రూపొందిస్తాం : మంత్రి శ్రీహరి
