Samantha Marriage: టాలీవుడ్ ప్రముఖ నటి సమంత (Samantha), ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ల వివాహం డిసెంబర్ 1వ తేదీన కోయంబత్తూరులోని శక్తివంతమైన లింగ భైరవి ఆలయ ప్రాంగణంలో, ఇషా యోగా సెంటర్‌లో అత్యంత నిరాడంబరంగా జరిగింది. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ వేడుకలో, ఈ జంట ఒక ప్రత్యేకమైన, అరుదైన వివాహ క్రతువు అయిన ‘భూత శుద్ధి వివాహం’ (Bhootha Shuddhi Vivaham) పద్ధతిలో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడీ ‘భూత శుద్ధి వివాహం’ పేరు సినీ వర్గాల్లో, అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియ గురించి తెలియని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి?
అసలు ఈ భూత శుద్ధి వివాహం అంటే ఏమిటి? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఈ భూత శుద్ధి వివాహం అనేది యోగ సంప్రదాయంలో మూలాలు కలిగి ఉన్న ఒక ప్రాచీన వివాహ క్రతువు (Ancient Yogic Process). ఇది కేవలం ఆచారం కాదని, జీవితాన్ని రూపాంతరం చెందించే శక్తివంతమైన ప్రక్రియగా పేర్కొనబడుతోంది. భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల శుద్ధీకరణ ప్రక్రియ ఆధారంగా వధూవరుల జీవితాలను ఒకటిగా అల్లుకోవడానికి చేసే పవిత్రమైన క్రియ ఇదని తెలుస్తోంది. ఇప్పటి వరకు వారి జీవితాలలో సంభవించినవి లేదా ఎదురైనవి మళ్లీ రాకుండా నిరోధించడానికి ఈ వివాహ ప్రక్రియను పవిత్రమైన యజ్ఞం లేదా హోమం సమక్షంలో నిర్వహిస్తారు. ఇది జంటల మధ్య భౌతిక, భావోద్వేగ అనుబంధానికి మించి మూలాల నుంచి లోతైన బంధాన్ని ఏర్పరుస్తుంది.
ఈ విధానాన్ని ఎంచుకోవడానికి కారణం?
సమంత, రాజ్ నిడిమోరు ఈ భూత శుద్ధి వివాహ విధానాన్ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం తెలిసిందే. గతంలో పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న వారు మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు, గతంలోని అనుభవాలు, సమస్యలు మళ్లీ దరి చేరకుండా ఉండటానికి ఈ భూత శుద్ధి ప్రక్రియను ఫాలో అవుతారని తెలుస్తోంది. అలాగే, సాధారణ వివాహ వయస్సు దాటి, కొంత ఎక్కువ ఏజ్ ఉన్నవారు కూడా తమ కొత్త బంధాన్ని పవిత్రంగా ప్రారంభించడానికి ఈ క్రతువును ఎన్నుకుంటూ ఉంటారని సమాచారం. ఈ కారణాలన్నీ ఆలోచించిన తర్వాతే సమంత, రాజ్ నిడిమోరు తమ నూతన జీవితాన్ని ఈ పవిత్రమైన యోగ సంప్రదాయ పద్ధతిలో ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, కొద్దికాలంగా ప్రేమ పక్షులుగా ఉన్న సమంత, రాజ్ నిడిమోరు ఇప్పుడు ఏకమై, తమ నూతన జీవితాన్ని ఈ పవిత్ర క్రతువు ద్వారా ప్రారంభించారు. దీనితో పాటు, వారిపై వినిపించిన అన్ని రకాల రూమర్లకు కూడా తెరపడినట్లయింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
