Harish Rao: విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది
Harish Rao (imagecredit:swetcha)
Political News, Telangana News

Harish Rao: విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనమేంది: హరీష్ రావు

Harish Rao: ‘కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కడుతున్న థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వెనుక 50 వేల కోట్ల స్కాం కు తెరలేపిందని.. తమ స్థాయిని దించుకొని నేను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అని భట్టి విక్రమార్క నన్ను విమర్శించారు.. ఆర్థిక మంత్రిగా పనిచేసినప్పుడు మీలాగా 20%, 30% కమిషన్లు తీసుకోవడం నాకు రాలేదు, అందుకే అందులో నేను అన్ఫిట్’ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చరిత్రలోనే ఏ రోజు కూడా సెక్రటేరియట్ లోపలికి వచ్చి ఆర్థిక శాఖ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన చరిత్ర ఈ రాష్ట్రంలోనే లేదన్నారు. తెలంగాణ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడారు. మన ఊరు – మన బడి బిల్లులు ఇవ్వండి అని కాంట్రాక్టర్లు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముందు ఇంతకుముందు ఎప్పుడైనా ధర్నా చేశారా? సర్పంచులు, చిన్నచిన్న కాంట్రాక్టర్లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పదుల సార్లు ఆర్థిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అరెస్ట్ అయిన చరిత్ర ఇంతకుముందు ఎప్పుడైనా ఉందా? ఫ్రస్ట్రేషన్ లో నోరు జారితే మొదటికే మోసం వస్తుంది భట్టి విక్రమార్క అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాధానం ఉంటే, తెలిస్తే చెప్పండి, లేదంటే మౌనంగా ఉండాలి.. అంతేకానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని హెచ్చరించారు.

రాబోయే రోజుల్లో..

పవర్ హాలిడే ఇచ్చిన కాంగ్రెస్ అన్ ఫిటా? లేదంటే నాణ్యమైన కరెంటు ఇచ్చిన బీఆర్ఎస్ అన్ఫిటా? మేము స్కాం గురించి మాట్లాడుతుంటే, దానికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో పవర్ డిమాండ్ పెరుగుతుందన్న సంగతి మూడో తరగతి పిల్లాడిని అడిగినా చెప్తాడు, ఇందులో మంత్రులు చెప్పాల్సింది ఏముంది? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుతున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, అవసరాలు పెరుగుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం కూడా పెరుగుతుంది.. రామగుండం, మక్తల్, పాల్వంచలో మూడు థర్మల్ విద్యుత్ కేంద్రాలు కడతామని.. క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు చెప్పారు.. మేము ప్రశ్నించేసరికి మక్తల్ లో పెట్టడం లేదు అని రెండు రోజుల్లోనే మాట మార్చారని మండిపడ్డారు. ఇంకా టెండర్లు పిలువలేదు, పనులే మొదలు కాలేదు, 50 వేల కోట్ల అవినీతి అని ఎలా అంటారని ఉప ముఖ్యమంత్రి ప్రశ్నిస్తున్నారు? మరి కాళేశ్వరంలో 84 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాకముందే లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఇదే మంత్రులు, నాయకులు మమ్మల్ని ఎలా తప్పుపట్టారు? రాహుల్ గాంధీ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు గల్లీ గల్లీకి పోయి చెప్పారు కదా? ఆనాడు అడ్డగోలుగా మాట్లాడినందుకు ముందు మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Also Read: Panchayat Elections: ఏకగ్రీవాల వైపు అడుగులేస్తున్న గ్రామాలు.. పార్టీలకు అతీతంగా పాలకవర్గం ఎంపిక!

తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంటు

ఎన్టీపీసీ రూ. 4.12కే ఇస్తున్నా.. కమీషన్ల కక్కుర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై రూ. 82 వేల కోట్ల భారం మోపుతోందని మండిపడ్డారు. ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయకుండానే, ఎలాంటి అప్పు చేయకుండానే, వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండానే.. మీరు ప్రతిపాదించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ కంటే తక్కువ ధరకే ఎన్టీపీసీ కరెంటు ఇస్తుంటే, మళ్లీ ఈ అప్పులు, పెట్టుబడులు, ధరలు ఎక్కువ పెట్టి కరెంటు కొనడం ఎందుకని సూటిగా ప్రశ్నిస్తే సమాధానం ఇప్పటిదాకా చెప్పడం లేదన్నారు. థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న తప్పుతో, రాష్ట్ర ప్రజలు మరో 25ఏళ్ల వరకు ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది.. రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు మాత్రమే పర్మినెంట్.. ఇప్పుడు ప్రభుత్వం చేసే అప్పులు, తప్పుల భారం రాష్ట్ర ప్రజలు మోయాల్సి వస్తుందన్నారు. విద్యుత్ శాఖలో ఆంధ్రా అధికారుల పెత్తనం.. కాంగ్రెస్ తెచ్చింది ప్రజా పాలన కాదు, ఆంధ్రా ద్రోహుల పాలన అన్నారు.

వ్యవస్థ అస్తవ్యస్తం

గ్రీన్ ఎనర్జీ పేరుతో రూ.600కోట్లు వసూలు.. మెగావాట్ కు రూ.30లక్షల లంచం ఇవ్వలేదని ఫైళ్లు తొక్కిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. మైనింగ్ ఇంజనీర్లకు విద్యుత్ శాఖలో పెత్తనమా? అర్హత లేని ఆంధ్రా అధికారుల కోసం తెలంగాణ బిడ్డలను బలిచేస్తారా? నాడు ఉద్యమకారులను అవమానించిన సమైక్యవాదులకే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందలం అన్నారు. అసెంబ్లీలో గ్రీన్ ఎనర్జీ అన్నారు.. ఇప్పుడు కమీషన్ల కోసం థర్మల్ ప్లాంట్లు కడుతూ మాట తప్పారన్నారు. ఇవాళ తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. అవగాహన లేమితో, ఆంధ్ర అధికారులతో, దోపిడీతో ఆగమాగం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఈ ఆంధ్ర విద్యుత్ అధికారులు అందరినీ తొలగించాలని, తెలంగాణ అధికారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి పర్యటనలు చేస్తున్నారు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుంది? నిద్ర పోతుందా? నియమ నిబంధనలు చూసే బాధ్యత ఎన్నికల సంఘానికి లేదా? కొడంగల్ – నారాయణపేట లిఫ్ట్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తున్నారు.. ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి? గ్రామాలకే కదా? ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను ప్రభావితం చేసే ఆ పనికి ఎన్నికల కోడ్ కు ఎందుకు వర్తించదు? శంకుస్థాపన చేస్తున్న రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు గ్రామాల నుంచి వెళ్లేటివే. రెండేళ్ల నుంచి ఏం చేశారు? ఎన్నికలకు ముందే గుర్తుకొచ్చాయా? తక్షణమే ఎన్నికల సంఘం రివ్యూ చేసి, పోలీసులకు ఆదేశాలిచ్చి కేసు నమోదు చేయాలి.. రాష్ట్ర ఎన్నికల సంఘం చట్ట పరంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

Also Read: Naga Chaitanya: సమంతతో విడాకులపై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్.. ఇప్పుడిదే టాక్!

Just In

01

Revanth Reddy: వడ్డించే వాడినే నేను… పాలమూరుకు ఎన్ని నిధులైనా ఇస్తా.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్‌లో మార్పు.. ఇకపై ఓటీపీ తప్పనిసరి

Boyapati Srinu: చిరంజీవితో చేయడానికి నా దగ్గర కథ లేదు.. బోయపాటి షాకింగ్ కామెంట్స్!

New Wine Shops: కొత్త వైన్స్‌‌లోకి త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త బ్రాండ్లు

Naga Vamsi: ఐబొమ్మ రవి.. వాడు మాకు రాబిన్‌హుడ్‌లా తయారయ్యాడు..