Gulf And Overseas Workers Welfare Board Soon CM Revanth Reddy
Politics

Minister: అమాత్యయోగం ఎవరికో?

– త్వరలో మంత్రివర్గ విస్తరణ
– ఉత్కంఠలో ఆశావహులు
– ఆషాడానికి ముందే మహూర్తం?
– ప్రస్తుతానికి నలుగురికే అవకాశం
– అధిష్ఠానం ప్రకటనకై ఎదురుచూపులు
Telangana State Cabinet Expansion(Political news in telangana): తెలంగాణలో త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణ కోసం ఆశావహులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలతో ఇప్పటికే దీనిపై అధిష్ఠానం చర్చలు జరిపినందున త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో సీనియర్ నేతలంతా ఎవరికి వారే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఆషాఢ మాసం దగ్గర పడుతుండడంతో ఆలోపే మంత్రివర్గ విస్తరణ చేయాలని, లేకుంటే శ్రావణ మాసం వరకు ఆగాల్సిందేనని విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఇప్పటికే అధిష్టానానికి ఎనిమిది మంది పేర్లు పీసీసీ తరపున అందాయని, ఒకటి, రెండు రోజుల్లో ఏఐసీసీ నుంచి ప్రకటన రావచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఆలస్యమైతే నెల పాటు వెయిటింగ్

జులై 6న వచ్చే ఆషాడ మాసం ఆగస్టు 5వ తేదీ వరకు కొనసాగనుంది. పైగా జూలై 5వ తేదీన అమావాస్య కావడంతో విస్తరణ అంతకు ముందే పూర్తి చేసే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి మరో 4 రోజులే మిగిలి ఉండటంతో ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం రాష్ట్ర నేతలు ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. గవర్నర్ రాధాకృష్ణన్‌ను కలిసి తేదీలను ఫిక్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలనేది పీసీసీ, ఏఐసీసీల మధ్య ఇప్పటికే స్పష్టత వచ్చిందనీ, జిల్లాలు, సామాజికవర్గాల ప్రాతిపదికన నలుగురి పేర్లు ఖరారైనట్టు సమాచారం. మరో వైపు చేరికలపైనా ఆషాడం ఎఫెక్ట్ పడే చాన్స్ ఉన్నది. పార్టీలో చేరే వారికి ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ లభించకుంటే వారు సైతం నెల రోజుల పాటు వెయిటింగ్ చేయాల్సి ఉంటుంది.

ప్రస్తుతానికి నలుగురికే ..!
కేబినెట్‌లోకి ఆరుగురిని తీసుకునేందుకు అవకాశమున్నా ప్రస్తుతానికి నలుగురికి మాత్రం చోటు కల్పించి రెండింటిని రిజర్వులో ఉంచవచ్చని తెలుస్తోంది. అయితే, దీనిపై అటు ఏఐసీసీ నుంచి ఇటు పీసీసీ నుంచి స్పష్టమైన సమాచారం లేకపోవటంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం లేని హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నేతలు తమలో ఎవరికి అమాత్యయోగం దక్కుతుందో అని పలు కోణాల్లో లెక్కలు వేసుకుంటున్నారు.

చక్కర్లు కొడుతున్న పలువురి పేర్లు..
ఇక కేబినెట్‌ విస్తరణలో వీరికే అవకాశం దక్కనుందంటూ సోషల్ మీడియాలో పలు పేర్లు చక్కర్లు కొడుతున్నా్యి. ఈ జాబితాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (మునుగోడు), బాలూ నాయక్ (దేవరకొండ), వాకిటి శ్రీహరి ముదిరాజ్ (మక్తల్), వెడ్మ బొజ్జు (ఖానాపూర్), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), రామ్మోహన్‌రెడ్డి (పరిగి), సుదర్శన్‌రెడ్డి (బోధన్), ప్రేమ్‌సాగర్‌రావు (మంచిర్యాల), వివేక్ (చెన్నూరు) తదితరుల పేర్లు ఏఐసీసీ పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. వీరిలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అవకాశం ఖాయమని గతంలో సీఎం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రకటించినందున ఆయనకు బెర్త్ కన్ఫామ్ అని పలువురు భావిస్తున్నారు. ఇక.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్‌లో చేరినప్పుడే మంత్రి బెర్త్ మీద హామీ పొందారనీ, భువనగిరి సీటు గెలుపులో ఆయన పాత్ర బాగా ఉన్నందున ఈయనకూ అవకాశం ఖాయమని చెబుతున్నారు. మైనారిటీ వర్గం నుంచి ఎవరూ మంత్రి లేనందున ఆ వర్గానికి ఒక బెర్త్ ఖాయమని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

నాలుగు రోజులే గడవు.. !
కేబినెట్ విస్తరణకు ఆషాఢం సెంటిమెంట్ ఉండటం, దీనికి మరో నాలుగు రోజులే గడువుండటంతో ఈ లోపే ఏఐసీసీ ప్రకటన చేసే అవకాశముంది. మంత్రి పదవి ఆశించినా అవకాశం రాని వారికి డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ లాంటి రాజ్యాంగ పదవులు కట్టబెట్టి ప్రొటోకాల్‌తో సంతృప్తిపర్చాలనే అభిప్రాయం రాష్ట్ర నేతల్లో వ్యక్తమవుతున్నది.

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?