Job Scam: విదేశీ ఉద్యోగం, ఆరంకెల జీతం అనగానే వెనకా ముందు ఆలోచించకుండా విమానం ఎక్కుతున్న యువత సైబర్ క్రిమినల్స్ ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లావోస్, కంబోడియా, థాయ్‌లాండ్, మయన్మార్ వంటి దేశాల్లో ఉద్యోగమంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు. ఈ ముఠాల వలలో చిక్కుకుంటే సైబర్ నేరాలు చేయడమే కాకుండా, పడరాని చిత్రహింసలు అనుభవించాల్సి వస్తుందని, ఇటీవల అతి కష్టం మీద తిరిగొస్తున్న బాధితుల ఉదంతాలు దీనికి నిదర్శనమని తెలిపారు.
ఏజెంట్ల ద్వారా ఉచ్చు
సైబర్ క్రైమ్ విభాగం సీనియర్ అధికారుల సమాచారం ప్రకారం, పదుల సంఖ్యలో ఉన్న ఈ గ్యాంగులను ఎక్కువగా చైనీయులే నడుపుతున్నారు. ఈ ముఠాలు జనసంచారం లేని ప్రాంతాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి, నేరాలు సాగిస్తున్నాయి. తమ కాల్ సెంటర్లలో పనిచేసే వారి కోసం కమీషన్లకు ఆశపడే ఏజెంట్ల నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ ఏజెంట్ల మాటలు నమ్మి, డిగ్రీ అర్హతతో ఆరంకెల జీతం ఆశించి, యువకులు అప్పులు చేసి మరీ ఆయా దేశాలకు చేరుకుంటున్నారు. ఎయిర్‌పోర్టుల్లో దిగగానే సైబర్ క్రిమినల్స్ మనుషులు వీరిని కాల్ సెంటర్లకు తీసుకెళ్లి, మొదటగా వారి పాస్‌పోర్టులు లాగేసుకుని, సైబర్ నేరాలు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నారు. ఆ తర్వాత మోసాలు చేయిస్తూ వందల కోట్లు లూటీ చేస్తున్నారు.
Also Read: Loan Scam: 20 ఏళ్లకు పండిన పాపం .. ఎట్టకేలకు బ్యాంకు ఉద్యోగికి జైలు శిక్ష
పారిపోవాలంటే భారీ మొత్తమే
సైబర్ నేరాలు చేయమని చెబితే తిరస్కరించిన వారిపై ఈ ముఠాలు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కడుపునిండా భోజనం కూడా ఇవ్వకుండా హింసిస్తూ, దేశం కాని దేశంలో మిమ్మల్ని ఏం చేసినా అడిగేవాడు లేడని బెదిరిస్తున్నారు. మరీ మొండికేస్తే, స్వదేశానికి వెళ్లిపోవాలంటే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే, ఇక్కడ మంచి ఉద్యోగమని చెప్పి స్నేహితులు లేదా పరిచయస్తులను పిలిపించి, వారిని తమకు అప్పగించి వెళ్లాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ చొరవతో తిరిగి వచ్చిన దాదాపు 500 మంది బాధితులు తాము అనుభవించిన నరకాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. వీరిలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు కూడా ఉన్నారు.
తస్మాత్ జాగ్రత్త
విదేశీ ఉద్యోగాల మోజులో యువత వెనకా ముందు ఆలోచించకుండా దేశం దాటి వెళ్ల వద్దని సైబర్ క్రైమ్ అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఏజెంట్లు దుబాయ్, ఆఫ్రికా దేశాల్లో ఉద్యోగమని చెప్పి లావోస్, మయన్మార్, కంబోడియా వంటి దేశాలకు పంపిస్తున్నారని అధికారులు తెలిపారు. విదేశీ జాబ్ అంటే, ఏ సంస్థ ఇస్తుందో, దాని వివరాలు ఏంటో ఖచ్చితంగా ఎంక్వయిరీ చేయాలి. జాబ్ ఆఫర్ లెటర్ గురించి తప్పనిసరిగా అడగాలని సూచించారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే ఇలాంటి మోసగాళ్ల బారిన పడకుండా ఉండవచ్చని అధికారులు పేర్కొన్నారు.
