Euphoria Teaser: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్, తన గత చిత్రాలైన ‘శాకుంతలం’, ‘రుద్రమదేవి’ వంటి భారీ ప్రాజెక్టుల తర్వాత, పూర్తి భిన్నమైన అంశంతో ‘యుఫోరియా’ అనే యువత సామాజిక డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం నుంచి విడుదలైన ‘టీజర్ ప్రస్తుతం సినీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘యుఫోరియా’ గ్లింప్స్ నేటి సమాజంలో, ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న సున్నితమైన అంశాలను, సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని రూపొందించినట్లు తెలుస్తోంది. టీజర్ ఒక అమ్మాయి డ్రగ్స్ తీసుకుని, మత్తులో మెట్రో ట్రైన్‌లో ప్రయాణించడం, భ్రాంతులకు లోనవడం వంటి దృశ్యాలతో ప్రారంభమవుతుంది. ఇది యువత డ్రగ్స్‌కు బానిసలవుతున్న తీరును కళ్లకు కట్టినట్లు చూపించింది.
Read also-Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో సినిమా చేయబోతున్నారా?.. ఆ నిర్మాత ఏం చెప్పాడు అంటే?
ధనవంతులైన యువకులు అదుపులేకుండా గడిపే పార్టీలు, కాలేజ్ వాతావరణం, నైట్‌లైఫ్‌ను వేగవంతమైన షాట్‌లతో చూపించారు. అనూహ్యంగా, టీజన్ ఒక సీరియస్ టోన్‌కి మారి, ఒక అమ్మాయిపై లైంగిక దాడికి సంబంధించిన భయానక అంశాన్ని సూచిస్తుంది. ఇది రేప్ సంస్కృతి, మహిళలను అలంకార వస్తువులుగా చూడటం వంటి అంశాలను హైలైట్ చేస్తుంది. లైంగిక దాడులకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేస్తున్న దృశ్యాలు కూడా చూపించారు. ఇది సినిమా కేవలం యూత్ డ్రామా మాత్రమే కాకుండా, బలమైన సామాజిక సందేశాన్ని కలిగి ఉందని స్పష్టం చేస్తోంది.
ఈ చిత్రంలో సీనియర్ నటి భూమిక చావ్లా కీలక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ బాబు ‘ఒక్కడు’ తర్వాత గుణశేఖర్-భూమిక కాంబో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రిపీట్ అవుతుండడం విశేషం. వీరితో పాటు సారా అర్జున్, నాజర్, తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (జయదేవ్ నాయర్‌గా), విఘ్నేష్ రెడ్డి (హీరోగా పరిచయం), లిఖిత యలమంచిలి, పృథ్వీరాజ్ అడ్డాల తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత సంచలనం కాల భైరవ అందించిన నేపథ్య సంగీతం ఈ టీజర్ లోని సన్నివేశాల తీవ్రతను అద్భుతంగా పెంచింది. గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ తన హోమ్ బ్యానర్ ‘గుణ హ్యాండ్‌మేడ్ ఫిల్మ్స్’ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ కె పోతన్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వంటి సాంకేతిక విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
Read also-Trivikram Venkatesh: వెంకీమామ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ఇదే!
గుణశేఖర్ తనదైన శైలిని మార్చుకుని, నేటి యువత, డ్రగ్స్ సమస్య, సామాజిక నేరాలు వంటి ఎడ్జీ అంశాలను ధైర్యంగా ఎంచుకోవడం అభినందనీయం. ‘యుఫోరియా’ గ్లింప్స్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలను పెంచింది, ముఖ్యంగా యువతను ఆలోచింపజేసే కథనంతో గుణశేఖర్ బలమైన ‘కమ్‌బ్యాక్’ ఇవ్వనున్నారని సినీ పండితులు భావిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6 తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
