Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) చేపట్టిన జాగృతి జనంబాట కార్యక్రమంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో, ఆయా జిల్లాల్లో యాత్రను వాయిదా వేస్తున్నట్లు కవిత ప్రకటించారు. అక్టోబర్ 25న నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర పలు జిల్లాల్లో విజయవంతంగా కొనసాగింది.
కామారెడ్డి జిల్లా పర్యటన వాయిదా
అయితే, గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా కామారెడ్డి జిల్లా పర్యటన వాయిదా పడింది. అయితే, ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో జాగృతి జనంబాట యాత్రను కొనసాగించాలని కవిత (Kavitha) నిర్ణయించారు. డిసెంబర్ 4 నుంచి 7 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో యాత్ర ప్రారంభం కానుంది. డిసెంబర్ 10 నుంచి 14 వరకు హైదరాబాద్ జిల్లాలో యాత్ర కొనసాగనుంది. డిసెంబర్ 18, 19 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, 21, 22 తేదీల్లో గద్వాల జిల్లాలో యాత్ర నిర్వహించనున్నారు. ఫిబ్రవరి మూడో వారం వరకు మిగిలిన పలు జిల్లాల్లో యాత్ర కొనసాగించనున్నట్లు జాగృతి నేతలు తెలిపారు.
Also Read:MLC Kavitha: ప్రజల సమస్యలు తీర్చేలా కొత్త పార్టీ.. కొత్త పార్టీపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
సీఎం పర్యటనలపై ఈసీకి ఫిర్యాదు
సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలపై తెలంగాణ జాగృతి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ సొమ్ముతో సీఎం ఎన్నికల ప్రచారం కోసం ఆరు జిల్లాల్లో ప్రచార సభలు నిర్వహిస్తున్నారని కవిత ఆరోపించారు. ఆదివారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుమిదినితో ఫోన్‌లో మాట్లాడిన కవిత, ప్రజాధనం అక్రమంగా ఖర్చు చేస్తూ ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందాలని సీఎం చూస్తున్నారని వివరించారు. ‘ఎన్నికలు గ్రామాల్లో ఉంటే.. జిల్లా కేంద్రాలకు వెళ్లి ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారా? ఇది ముమ్మాటికీ ఎన్నికల నిబంధనను ఉల్లంఘించటమే’ అని కవిత ఎక్స్ వేదికగా విమర్శించారు. సీఎం పర్యటనలపై సీరియస్‌గా దృష్టి సారించామని ఈసీ చెప్పిందని, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు కలెక్టర్లు హాజరు కాకుండా ఆదేశాలు ఇచ్చే విషయం పరిశీలిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపినట్లు కవిత పేర్కొన్నారు. సీఎం జిల్లాల పర్యటనను వెంటనే నిలిపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Also Read: MLC Kavitha: వనపర్తి జిల్లాలో జాగృతి జనం బాటలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు..!
