– ఫలించిన ప్రయత్నం
– సీఎం చొరవతో కేంద్రం సానుకూల స్పందన
– స్మార్ట్ మిషన్ గడువు పొడిగింపు
-వరంగల్, కరీంనగర్‌లకు ప్రయోజనం
Smart Mission: సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం ఫలించింది. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో నిర్వహించిన సమావేశం సత్ఫలితాన్ని ఇచ్చింది. స్మార్ట్ మిషన్ గడువు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. స్మార్ట్ మిషన్ గడువు ఈ నెలాఖరుతో ముగియనుంది. కానీ, స్మార్ట్ సిటీలైన వరంగల్, కరీంనగర్‌లలో ఈ స్కీం కింద మొదలు పెట్టిన పనులు ఇంకా పూర్తి కాలేవు. దీంతో స్మార్ట్ మిషన్ గడువు పొడిగించాలని సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు కేంద్రమంత్రి ఖట్టర్ సానుకూలంగా స్పందించారు. ఇంతలోనే కేంద్రం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఈ రెండు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది.
స్మార్ట్ మిషన్‌ను 2025 మార్చి 31వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఇప్పటికే నిధులు కేటాయించి ఆమోదించిన పనులు మాత్రమే కొనసాగించాలని, కొత్త పనుల మంజూరు ఉండబోదని స్పష్టం చేసింది. జరుగుతున్న పనులకు సంబంధించిన నిధులను ఈ ఏడాది సెప్టెంబర్ వరకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిన విడుదల చేస్తామని తెలిపింది.
రాష్ట్రంలో వరంగల్, కరీంనగర్ నగరాల్లో స్మార్ట్ మిషన్ పనులు చేపట్టారు. వరంగల్‌లో ఇప్పటి వరకు 45 పనులు పూర్తయ్యాయి. కానీ, రూ. 518 కోట్ల వ్యయంతో చేపట్టిన మరో 66 పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇంకా కొనసాగుతున్నాయి. స్మార్ట్ మిషన్ గడువు పెంచడంతో ఈ పనులు కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి వీలుచిక్కింది. అలాగే.. కరీంనగర్‌లో స్మార్ట్ మిషన్ కింద 25 పనులు పూర్తయ్యాయి. రూ. 287 కోట్లతో చేపట్టిన మరో 22 పనులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజా నిర్ణయంతో ఈ పనులకు కేంద్రం నుంచి నిధులు అందనున్నాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు గడువు విధిస్తూ.. వీలైనంత త్వరగా పనులను పూర్తి చేయాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.