– రాహుల్ గాంధీ చెప్పిన 2 లక్షల కొలువులెక్కడ?
– బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నలకే ఉద్యోగాలు
– నిరుద్యోగులు అరిగోస వినిపించటం లేదా?
– నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీని స్తంభింపజేస్తాం
– బీఆర్ఎస్ నేత హరీష్ రావు
Rahul Gandhi: ఎన్నికల ముందు నిరుద్యోగులపై కపట ప్రేమ చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. గద్దెనెక్కిన తర్వాత వారి గుండెల మీద తన్నుతున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఆదివారం ఆయన సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో గ్రూప్స్ పరీక్షల వ్యవహారంలో న్యాయం చేయాలంటూ దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ యువతకు వాగ్దానం చేశారని, ఆయనను అశోక్ నగర్‌కు పిలిపించి మరీ రేవంత్ రెడ్డి హామీలిప్పించారని గుర్తుచేశారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటుతున్నా వాటి అమలు సంగతే మరిచారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ సమస్యలపై గొంతెత్తుతున్న విద్యార్థులు, నిరుద్యోగుల మీద కేసులు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో బల్మూరి వెంకట్, తీన్మార్ మల్లన్నకు ఉద్యోగాలు వచ్చాయని.. ధర్నాలు చేస్తున్న గ్రూప్స్ అభ్యర్థులకు మాత్రం రాలేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గతంలో ప్రభుత్వం ఘనంగా చెప్పుకున్న జాబ్ క్యాలెండర్ సహా హామీలు తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే నిరుద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తామని, అవసరమైతే అసెంబ్లీని స్తంభింపచేస్తామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు 1:100 చొప్పున అభ్యర్థులను పిలుస్తున్నప్పుడు అదే విధానం తెలంగాణలో ఎందుకు సాధ్యంకాదని హరీష్ రావు ప్రశ్నించారు. ఇది మోతీలాల్ ఒక్కడి సమస్యే కాదని, గ్రూప్స్ అభ్యర్థుల అందిరిదీనని వివరించారు. ఈ సమస్య మీద మోతీలాల్ నాయక్ ఏడు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని, ఇకనైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి, సీఎం వచ్చి నిరుద్యోగుల బాధలు వినాలన్నారు. మోతీలాల్ ప్రాణానికి హాని కలిగితే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. దీక్ష విరమించాలని మోతీలాల్‌ను కోరినట్లు హరీశ్‌రావు తెలిపారు. గ్రూప్-2, 3 ఉద్యోగాల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు. జీవో 46 రద్దు చేస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని, మెగా డీఎస్సీ వేసి ఇకనైనా టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.