KTR: బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ ఎన్నికలు టాస్క్ గా మారాయి. క్షేత్రస్థాయిలో పట్టుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నా అవి బెడిసి కొడుతున్నాయి. కమిటీలు లేకపోవడం, వ్యతిరేకత ఉన్న నేతలే ఇన్ చార్జులుగా ఉండటంతో ఆశించిన స్పందన రావడం లేదని సమాచారం. మెజార్టీ సీట్లు సాధిస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించినా అవి మాటలకే పరిమితం అయ్యాయి. నేతలను కోఆర్డినేషన్ చేసేవారు సైతం లేరనే పార్టీ కేడర్ అభిప్రాయపడుతుంది. అలాంటప్పుడు ఎలా ఎక్కువసీట్లు గెలుస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
వారికి పదవులు లేవు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో స్థానిక ఎమ్మెల్యేలకే నియోజకవర్గ ఇన్ చార్జీ బాధ్యతలను బీఆర్ఎస్ పార్టీ(BRS Party) అప్పగించింది. దీనికి తోడు ఇతర పార్టీల నుంచి విజయం సాధించి.. బీఆర్ఎస్ లో చేరిన నియోజకవర్గాల్లోనూ వారికే బాధ్యతలు అప్పగించారు. దీంతో పాత, కొత్త నేతల మధ్య ఏళ్లుగడుస్తున్నప్పటికీ గ్యాప్ కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సైతం గ్రామాల్లో వర్గాలను ప్రోత్సహించారు. ఒక్కో గ్రామంలో రెండు వర్గాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఆ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అసంతృప్తి అలాగే కొనసాగుతుంది. మరోవైపు గ్రామకమిటీలను సైతం పూర్తిస్థాయిలో వేయకపోవడం, అనుబంధ కమిటీలు సైతం లేకపోవడంతో బలహీనంగా ఉంది. పార్టీ కేడర్ గ్రామాల్లో ఉన్నప్పటికీ వారికి పదవులు లేవు.. దీంతో నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లోనూ ఎలా కలిసి పోతారనేది విస్తృత చర్చజరుగుతుంది. నియోజకవర్గ ఇన్ చార్జులు సైతం చొరవ తీసుకుంటున్న సందర్భాలు అంతంత మాత్రమే అనే ఆరోపణలు వస్తున్నాయి. గెలుపు బాధ్యతలు అప్పగించినా ఎలా ముందుకు వెళ్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ చార్జుల వ్యవహారశైలీ, గ్రూపులను ప్రోత్సహించడం, గ్రామస్థాయి నేతలు వెళ్తే కనీసం సమయం ఇవ్వకపోవడం, సమస్యలను వినకపోవడంతో పార్టీ ఓటమికి కారణమైంది. అయినప్పటికీ పార్టీ దృష్టిసారించకపోవడంతో ఎలా ముందుకు వెళ్తుందనేది నేతలకే తెలియాలి.
Also Read: Deeksha Divas: కేసీఆర్ నిరాహార దీక్షకు నేటితో 16 ఏళ్లు.. కేటీఆర్, హరీశ్, కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
పార్టీలోకి ఓ కీలక నేత
త్వరలోనే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర కమిటీ వరకు అన్ని కమిటీలు వేస్తామని.. అందులో పార్టీకోసం పనిచేసేవారికి కీలక పదవులు ఇస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సైతం పలు సందర్భాల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు వేయలేదు. అయితే ప్రస్తుతం అసెంబ్లీ ఇన్ చార్జులుగా వ్యవహరిస్తున్న వారి పనితనంను సైతం ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయని పార్టీలోకి ఓ కీలక నేత తెలిపారు. ఆ నియోజకవర్గంలో ఆయనకు పట్టువచ్చిందా.. ఫెయిల్యూర్ లీడరా? ప్రభుత్వంపై వ్యతిరేక ఏమేరకు ఉంది.. అనేది పార్టీ అధిష్టానం తెలుసుకునేందుకు ఫోకస్ పెట్టింది. ఆ నేత సత్తాతోనే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టికెట్ ఆధారపడి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఇన్ చార్జులకే గెలుపు బాధ్యతలు
ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు నియోజకవర్గాల్లో గానీ, మండలంలోగానీ ద్వితీయ శ్రేణి నాయకులను ఎదగనియ్యలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎవరైనా ఎదిగే ప్రయత్నం చేసినా కేసులతో పాటు రాజకీయాలను వీడేలా చేశారనే విమర్శలు వచ్చాయి. కొంతమంది బహిరంగంగానే ప్రకటనలు చేశారు. నేతల తీరును ఎండగట్టిన సందర్భాలు ఉన్నాయి. దీనికి తోడు నాడు ఎమ్మెల్యేలు ఇన్ చార్జులుగా ఉన్నప్పటికీ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులను సైతం కలిసి మాట్లాడేందుకు సమయం ఇవ్వలేదు. అంతేకాదు ఎవరైనా ఆ నేతలపై ఆరోపణలు చేస్తే వారిని దూరంపెట్టిన ఘటనలు ఉండటం, ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కోల్పోవడం, తిరిగి గతంలో ఉన్న ఇన్ చార్జులకే గెలుపు బాధ్యతలు అప్పగించడంతో గుర్రుగా ఉన్నారు.. ఇలాంటి సందర్భంలో ఎలా మెజార్టీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంటారనే ప్రశ్నతలెత్తుకుంది. మరోవైపు నీలినీడలు కమ్ముకున్నాయి.
జోష్ నింపేందుకే..
సర్పంచ్ ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఏయే నియోజకవర్గాలకు వెళ్తారనేది మాత్రం ప్రకటించలేదు. నైరాశ్యంలో ఉన్న పార్టీ కేడర్ లో జోష్ నింపేందుకే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిసింది. కేటీఆర్ ప్రచారానికి వెళ్తే కొంత కలిసి వస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏకమైనప్పటికీ బీఆర్ఎస్ కు మాత్రం సర్పంచ్ ఎన్నికలు పెద్ద టాస్క్ గా మారాయి. ఎలాంటి ప్రణాళికలతో వెళ్లి విజయం సాధిస్తారనేది చూడాలి.
Also Read: Thummala Nageswara Rao: నకిలీ విత్తనాలపై నియంత్రణ రాష్ట్రానికే ఇవ్వాలి : వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల
