Thummala Nageswara Rao: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా విత్తన బిల్లు 2025 రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరించే విధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ముసాయిదా బిల్లు రైతులకు మేలు చేసేలా కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను హరించే విధంగా రూపుదిద్దుకుందని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయం పూర్తి బాధ్యత రాష్ట్రాలదైనా, ఈ బిల్లులో కీలక అధికారాలు కేంద్రాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఆందోళనకరమని అన్నారు.
ఇది రాజ్యాంగ భావనకు విరుద్ధం
విత్తనాల రిజిస్ట్రేషన్ నుంచి లైసెన్సింగ్ వరకు, మార్కెట్ నియంత్రణ నుంచి నాణ్యత పర్యవేక్షణ వరకు అన్నిటినీ కేంద్రం చేతుల్లోకి తీసుకోవాలనే ధోరణి కనిపిస్తోందని, ఇది రాజ్యాంగ భావనకు విరుద్ధమని, రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. విత్తన సర్టిఫికేషన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వాల వద్దే ఉండాలని మంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే, విత్తనాల నాణ్యతపై ప్రత్యక్ష పర్యవేక్షణ చేసే సామర్థ్యం, యంత్రాంగం రాష్ట్రాల వద్దే ఉందన్నారు. కేంద్రం ఇచ్చే లైసెన్స్ తీసుకుంటే అది ఏ రాష్ట్రంలోనైనా వ్యాపారం చేయడానికి ఈ చట్టం అవకాశం కల్పిస్తుందని, లైసెన్స్ రద్దు చేయాలన్నా మళ్లీ కేంద్రానికి సిఫార్సు చేయాల్సిందే తప్ప, రాష్ట్ర పరిధిలో చర్య తీసుకోవడానికి అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Thummala Nageswara Rao: చేనేత రంగానికి రూ.వెయ్యి కోట్లు.. ఏడాదిన్నరలోనే ఖర్చు చేశాం : మంత్రి తుమ్మల
ధరల నియంత్రణ లేదు
మార్కెట్‌లో ఏ కంపెనీ ఎంత ధరకు అమ్ముతుందో దాని మీద నియంత్రణ లేదని, ఎంత ధరకు అమ్మాలనే నిర్దేశించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి అన్నారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ధర నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. నాణ్యమైన విత్తనం రైతుకు అందుబాటులో తేవడం ఎంత ముఖ్యమో, నకిలీ విత్తనాల వల్ల నష్టం జరిగినప్పుడు రైతులకు సకాలంలో నష్ట పరిహారం అందించే ఏర్పాటు ఉండడం కూడా అంతే కీలకమన్నారు.
బిల్లులో సవరణలు చేయాలి
విత్తనాల నాణ్యత, నియంత్రణ కోసం ఈ చట్టం ఉద్దేశ్యం మంచిదే అయినప్పటికీ, రైతుల రక్షణ, రాష్ట్రాల హక్కులు, నష్టపరిహారం విధానం, విత్తన రైతుల సమస్యలు వంటి కీలక అంశాల్లో అవసరమైన మార్పులు చేయాలని తుమ్మల కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోనికి తీసుకొని, అందుకు అనుగుణంగా బిల్లులో సవరణలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రొ. కొదండరాం, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ అన్వేష్ రెడ్డి, మాజీ మంత్రి వడ్డె శోభనాధ్రిశ్వరరావు, వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, వైస్ ఛాన్సలర్‌లు జానయ్య, రాజిరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి, విత్తనరంగ నిపుణులు, అధికారులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
