Arvind Kejriwal: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మూడు రోజలు సీబీఐ కస్టడీ ముగియడంతో శనివారం కోర్టులో హాజరుపరిచారు. విచారణకు కేజ్రీవాల్ సహకరించలేదని, సరైన సమాధానాలు చెప్పలేదని సీబీఐ కోర్టులో పేర్కొంది. కాబట్టి, అరవింద్ కేజ్రీవాల్‌ను విచారించడానికి తమకు అవకాశం ఇవ్వాలని కోరింది. సీబీఐ రిమాండ్ పిటిషన్‌ను పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు అందుకు అంగీకరించింది. అరవింద్ కేజ్రీవాల్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని విధించింది. జులై 12వ తేదీ వరకు ఆయన జైలులోనే ఉండనున్నారు. 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టులో హాజరుపరుస్తారు.
కోర్టు జ్యుడీషిల్ కస్టడీని విధించడంతో అరవింద్ కేజ్రీవాల్‌ను తిరిగి జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ మళ్లీ విచారించనుంది. మనీలాండరింగ్ కోణంలో విచారిస్తుంది. మూడు రోజుల కస్టడీలో ఢిల్లీ లిక్కర్ పాలసీని ఎందుకు మార్చారని ప్రశ్నించగా.. కేజ్రీవాల్ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేదని సీబీఐ ఆరోపించింది. హోల్‌సేల్ అమ్మకందార్లకు లబ్ది చేకూర్చేలా ప్రాఫిట్ మార్జిన్‌ను 5 శాతం నుంచి 12 శాతానికి ఎందుకు పెంచారని ప్రశ్నించినా సరైన సమాధానాలు చెప్పలేదని పేర్కొంది.
ఇదే కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ తనయ కవిత తిహార్ జైలులో ఉన్నారు. ఆమెను కూడా ఈడీ, సీబీఐ విచారిస్తున్నది. ప్రస్తుతం ఆమె రిమాండ్ ఖైదీగా ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నారు. ఇది వరకు ఆప్ అగ్ర నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి నాయకులు ఈ కేసులో జైలులోనే ఉన్నారు. ఇక ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ మాత్రం బెయిల్ పై విడుదలై బయటకు వచ్చారు.