– గుండెపోటుతో కన్నుమూసిన డీఎస్
– మూడు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా సేవలు
– రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
– పార్టీలకతీతంగా ప్రముఖుల నివాళులు
Nizamabad: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కనుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయం తెలియగానే పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ హుటాహుటిన నిజామాబాద్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. చిన్నకుమారుడైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి మరణ వార్త తెలిసి ఢిల్లీ నుంచి బయలుదేరారు.
రాజకీయ ప్రస్థానం
1948 సెప్టెంబర్ 27న నిజామాబాద్‌లో జన్మించిన డీఎస్.. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌లో పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగిన ఆయన.. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో గెలుపొందారు. అనంతరం 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి, ఐ అండ్ పీఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నతవిద్య, అర్బన్ లాండ్ సీలింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో అప్పటి టీఆర్‌ఎస్‌తో పోత్తుకుదుర్చుకోవడంలో కీలకపాత్ర పోషించారు. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా సేవలందించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మండలి విపక్ష నేతగా పనిచేశారు. 2015లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ అంతర్ రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అనంతరం అనారోగ్యం కారణంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
డి. శ్రీనివాస్కు భార్య, ఇద్దరు కుమారులు కాగా, వీరిలో పెద్ద కుమారుడు సంజయ్ నిజామాబాద్ మేయర్గా పని చేశారు. తండ్రి మరణవార్త విని నిజామాబాద్ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. తండ్రి పార్థివ దేహాన్ని చూసి సంజయ్ బోరుమన్నారు. సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రెండవ కుమారుడు, నిజమాబాద్ ఎంపీ అర్వింద్ ఈ విషయం తెలిసి ఢిల్లీ నుంచి ఉదయాన్నే బయలుదేరి హైదరాబాద్ చేరుకున్నారు. ‘అన్నా..అంటే నేనున్నా అని,ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. I WILL MISS YOU DADDY. నా తండ్రి,నా గురువు అన్నీ నాన్నే! ఎదురొడ్డు, పోరాడు,భయపడకు అని నేర్పిన నువ్వు నాతో ఎప్పటికీ ఉంటావు’ అంటూ భావోద్వేగ ట్వీట్ చేశారు.
ఆదివారం అంత్యక్రియలు..
డీఎస్ పార్థివ దేహాన్ని శనివారం మధ్యాహ్నం 2గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచి, అనంతరం నిజామాబాద్‌లోని స్వగృహానికి తరలించారు. ఆదివారం నిజామాబాద్‌లో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, డీఎస్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. రేపటి అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొననున్నట్లు తెలిపారు. తాను చనిపోయాక తనపై కాంగ్రెస్ జెండా కప్పాలని కోరిన డీఎస్.. కోరిక మేరకు రేపు పీసీసీ నేతలు ఆయన పార్థివ శరీరంపై కప్పుకునే చనిపోవాలని డీఎస్ కోరిక మేరకు పీసీసీ నేతలు
ఆయన మరణ వార్త తెలిసి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
ప్రముఖుల సంతాపం
‘ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా సమర్థవంతంగా సేవలందించి, 2004లో కాంగ్రెస్ గెలుపులో డీఎస్ కీలక పాత్ర పోషించారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నతస్థాయికి ఎదిగిన ఆయన ఎందరో రాజకీయ నాయకులకు గురువుగా మార్గదర్శకత్వం వహించారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ, కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
‘సుదీర్ఘ కాలం పాటు ప్రజాసేవకు అంకితమైన డి. శ్రీనివాస్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. ఎప్పుడూ హూందాగా రాజకీయాలు చేసిన ఆయన తాను నమ్మిన సిద్ధాంతం కోసం గట్టిగా పోరాడారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను.’– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
‘సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారు. 2004-2009 వరకు అసెంబ్లీలో డీఎస్ అందించిన ప్రోత్సాహం మరువలేనిదన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’– జి. కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి
‘రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజలతో మమేకమవుతూ నాలుగు దశాబ్దాలపాటు ప్రజాసేవతో తరించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’ – కేటీఆర్