BJP Madhavi Latha: బీజేపీలో నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో పదవులు దక్కడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే కోవలో హైదరాబాద్(Hyderabad) లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అభ్యర్థి మాధవీలత(Madhavilatha) సైతం ఉండటం గమనార్హం. లోక్‌సభ ఎన్నికల్లో హైకమాండ్ మాధవీలతకు హైదరాబాద్ టికెట్ అందించింది. వాస్తవానికి ఆమె పార్టీలో చేరకముందే టికెట్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాతే ఆమె పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ ఎన్నిక ఆమెకు దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఎంఐఎం నేత అసద్‌పై ఆమె పోటీకి దిగడం, దీటుగా కౌంటర్లు ఇవ్వడంతో అతి తక్కువ సమయంలో పేరొందింది. అలాంటి నేత ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని పదవి ఇవ్వాలంటూ మొర పెట్టుకోవడం గమనార్హం. చిన్నదో పెద్దదో ఏదో ఒక పదవి ఇస్తే ప్రజల్లోకి వెళ్లేందుకు సులువుగా ఉంటుందని ఆమె చెబుతున్నారు.
పార్టీలో లోపం వల్లే అధికారానికి దూరం
రాబోయే ఎన్నికల్లో కరా ఖండిగా బీజేపీ అధికారంలోకి వస్తుందని మాధవీలత బల్లగుద్ది చెబుతున్నారు. కానీ, పార్టీలో లోపం వల్ల అధికారంలోకి రాలేక పోతున్నట్లు వాపోయారు. లీడర్లు ప్రజల వద్దకు వెళ్లి ఓటర్లను కలిసి అభ్యర్థిస్తే అది సాధ్యమేనని చెబుతున్నారు. అయితే, ఇది ఎన్నికల ముందు కాకుండా ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాల్సిందని సూచించారు. నేతలంతా సమష్టిగా కలిసికట్టుగా ముందుకెళ్తే తప్ప తెలంగాణలో అధికారంలోకి రాలేమని ఆమె కుండ బద్దలు కొట్టారు. అంతా కలిసి బాధ్యతలు పంచుకోవాలని, పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి దాదాపు 18 నెలలైనా తనకు ఇప్పటి వరకు సరైన పదవి దక్కలేదని ఆమె ఆవేదన వెళ్లగక్కారు. ఓటర్ల వద్దకు వెళ్లేందుకు తనకు ఏ పదవి ఇచ్చినా ఒకేనని చెబుతున్నారు. పార్టీ తమను బయట ప్రదేశాలకు పంపించాల్సింది పోయి పదవులు ఇవ్వకుండా తాత్సారం వహిస్తోందని వాపోయారు. నిజానికి గ్రామస్థాయిలో బీజేపీ ఎంతో బలంగా ఉందని, మరింత బలోపేతం కావాలంటే నాయకులు వారి దగ్గరికి వెళ్లాలని పేర్కొన్నారు. ఈ విషయంలో ఓటర్ల తప్పు ఏమాత్రం లేదని, వారిని అనడానికి కూడా ఏమీలేదని ఆమె చెబుతున్నారు.
Also Read: GHMC: జీహెచ్ఎంసీలోకి 27 యూఎల్‌బీల విలీనం.. మరింత పెరగనున్న బల్దియా విస్తీర్ణం!
మాధవీలత ఓవర్ కాన్ఫిడెన్సే కారణమా?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గాను టికెట్ కోసం కూడా ఆమె ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేసినా వృథా అయ్యాయి. కాగా, త్వరలో ఖైరతాబాద్‌కు బై పోల్ వచ్చే అవకాశమున్నదనే చర్చ జోరుగా జరుగుతుండటంతో ఆ టికెట్ కోసం కూడా ఆమె ప్రయత్నించే అవకాశముందని చర్చించుకుంటున్నారు. వాస్తవానికి ఆమె ఎంపీ(MP) ఎలక్షన్ తర్వాత నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన దాఖలాలు కూడా చాలా తక్కువ. పార్టీ కార్యకలాపాలకు కూడా ఆమె దూరంగానే ఉంటున్నారు. దీంతో ఆమె పార్టీని లైట్ తీసుకుందా? అనే అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా స్థానిక నేతలను లెక్క చేయకపోవడం వంటి అంశాల కారణంగా రాష్ట్ర నాయకత్వం సైతం ఆమెను పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మాధవీలత ఓవర్ కాన్ఫిడెన్సే ఈ పరిస్థితికి కారణమని కమలనాథులు చెబుతున్నారు. ఎంపీ ఎలక్షన్ టైంలో అమాంతం పెరిగిన గ్రాఫ్ ఓటమితో క్రమంగా తగ్గుముఖం పట్టింది. చివరకు పార్టీలో ఏదో ఒక పదవి ఇవ్వండి అంటూ మొర పెట్టుకునే స్థితికి ఆమెను తీసుకొచ్చారంటూ చర్చించుకుంటున్నారు. కాగా, త్వరలో ఖైరతాబాద్‌కు బైపోల్ ఉంటే అవకాశముందనే చర్చ మొదలవడంతో ఆమె మళ్లీ తెరపైకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు చెబుతున్నారు. మరి ఆమె మొరును రాష్ట్ర నాయకత్వం ఆలకించి పదవి అప్పగిస్తుందా? లేక ప్రస్తుతమున్నట్లుగానే పట్టించుకోకుండా వదిలేస్తుందా? అనేది చూడాలి.
Also Read: Konda Surekha: వన్యప్రాణి సంరక్షణలో.. తెలంగాణ దేశానికి ఆదర్శం.. మంత్రి కొండా సురేఖ!

