NBK111: నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలో కుర్ర హీరోలకు సైతం సవాల్ విసురుతున్నారు. వరుస బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు కొడుతూ, ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) చిత్రం మరో 9 రోజుల్లో థియేటర్స్‌లోకి రాబోతోంది. డిసెంబర్ 5న ‘అఖండ 2: తాండవం’ విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు బాలయ్య తన తదుపరి చిత్రాన్ని బుధవారం (నవంబర్ 26) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. దీంతో ఆయన స్పీడ్‌కు, ప్లానింగ్‌కు అంతా ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య న్యూ మూవీ లాంచ్ వివరాల్లోకి వెళితే..

Also Read- Bigg Boss Telugu 9 Winner: ఇప్పటి వరకు పూర్తయిన గేమ్‌ని గమనిస్తే.. విన్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉందంటే?
క్లాప్ కొట్టిందెవరంటే..
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) వంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు గోపీచంద్ మలినేని (Gopichand Malineni)తో మరో సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కొలాబరేషన్‌లో హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా NBK111 ఉండబోతుంది. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ సరసన ఇందులో నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించబోతున్నట్లుగా తెలుపుతూ.. ఇటీవల ఆమె లుక్‌ని మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘సింహా, జై సింహా, శ్రీ రామరాజ్యం’ చిత్రాల తర్వాత బాలయ్య సరసన మరోసారి నయనతార కలిసి నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు (NBK111 Opening). ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్‌ను నిర్మాతలకు అందజేయగా.. బాలకృష్ణతో అనేక బ్లాక్‌బస్టర్‌లను తెరకెక్కించిన దర్శకుడు బి గోపాల్ క్లాప్ కొట్టారు. బాలయ్య కుమార్తె తేజస్విని నందమూరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్‌కు బోయపాటి శ్రీను, బాబీ, బుచ్చి బాబు సమిష్టిగా దర్శకత్వం వహించారు.

Also Read- Real Star Upendra: అప్పటి నుంచి సినిమా విడుదల రోజు థియేటర్‌కి వెళ్లడం ఆపేశాను
సమరశూరుడిలా బాలయ్య
ఈ సినిమాతో గోపిచంద్ మలినేని తొలిసారి హిస్టారికల్ డ్రామాలోకి అడుగుపెడుతున్నారు. కమర్షియల్ బ్లాక్‌బస్టర్స్ రూపొందించడంతో దిట్ట అయిన గోపీచంద్ మలినేని.. తన ప్రత్యేక మాస్ టచ్‌ను ఈసారి ఒక భారీ చారిత్రక కథలో మిళితం చేస్తూ, నందమూరి బాలకృష్ణను ఇప్పటివరకు చూడని ఓ కొత్త అవతార్‌లో చూపించబోతున్నారు. ఈ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన స్పెషల్ పోస్టర్‌లో.. ఒక చేతిలో ఖడ్గం, మరో చేతిలో యాంకర్ పట్టుకుని నటసింహం బాలయ్య అఖండమైన రాజసంతో అదరగొడుతున్నారు. గడ్డం, పొడవాటి జుట్టు, శక్తివంతమైన తీరుతో సమరశూరుడిలా ఈ పోస్టర్‌లో ఆయన కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ చూసి నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, దర్శకుడికి థ్యాంక్స్ చెబుతున్నారు. హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషన్స్‌తో పాటు అద్భుతమైన యాక్షన్, విజువల్ వండర్‌గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోందని టీమ్ చెబుతోంది. ఈ చిత్రంలో నటించిన ఇతర తారాగణం, సాంకేతిక సిబ్బందికి సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
