Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ వేసింది. జూన్ 30వ తేదీ వరకు ఈ కమిషన్ విచారించి నివేదిక అందించాలని మార్చి 14వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, పీసీ ఘోష్ కమిషన్ పలు కారణాల రీత్యా ఇంకా విచారణ ముగియలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కమిషన్ విచారణ గడువును రెండు నెలలపాటు పొడిగించింది. ఆగస్టు 31వ తేదీ వరకు ఈ కమిషన్ విచారణకు గడువు ఇస్తూ రాష్ట్ర నీటిపారుదల డిపార్ట్‌మెంట్ సెక్రెటరీ రాహుల్ బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఈఎన్సీలు, ప్రస్తుత ఈఎన్సీలు, సీఈలు, ఇతర ఇంజినీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులను పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్లను దాఖలు చేయాలని ఆదేశించింది. పీసీ ఘోష్ ఆదేశాలతో గురువారం నాటికి 60 మంది సీల్డ్ కవర్‌లో అఫిడవిట్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఈ అఫిడవిట్లను పరిశీలించి కమిషన్ ఓపెన్ హౌజ్ డిస్కషన్, క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నది. వచ్చే వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది.
అధికారులతోపాటు అవసరమైతే రాజకీయ నాయకులకూ నోటీసులు ఇస్తామని, వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తామని గతంలో పీసీ ఘోష్ అన్నారు. తాజాగా ప్రభుత్వం కమిషన్ విచారణ గడువు పెంచడంతో త్వరలోనే రాజకీయ నాయకులనూ విచారణకు పిలిచే అవకాశం ఉన్నదని రాజకీయ వర్గాలు తెలిపాయి. ఆగస్టు 31వ తేదీలోపు తుది నివేదికను ప్రభుత్వానికి అందించేలా కమిషన్ తన కార్యచరణను రీషెడ్యూల్ చేసుకోనుంది.