BJP Telangana: రాష్ట్రంలో త్వరలో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలకు కమలదళం సమాయత్తమవుతోంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపించేందుకు భారీ ప్రణాళికలు రచిస్తోంది. వీటిని కేవలం స్థానిక ఎన్నికలుగా పరిగణించకుండా, తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేసే వేదికగా మలుచుకోవాలనుకుంటోంది. స్థానిక పోరులో గెలిచి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని నిరూపించుకోవాలని చూస్తోంది. అయితే, లోకల్ బాడీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగవు, కాబట్టి ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో పార్టీలో గందరగోళం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల నేతృత్వంలోనే స్థానిక అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కమలనాథులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
రూట్ క్లియర్ చేసుకోవాలన్న వ్యూహం
గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలాగూ పనిచేస్తారు. కాబట్టి, పోటీ చేసి ఓడిపోయినవారికి కూడా అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారు ఓటమితో నిరుత్సాహంలో ఉన్నారు. ఈ ఎలక్షన్‌తో అయినా వారిని యాక్టివ్ చేయాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ఈ ఎలక్షన్‌లో కష్టపడి పనిచేసేలా చూడాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎలక్షన్‌లో భారీస్థాయిలో స్థానిక సంస్థల స్థానాలు గెలిచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రూట్ క్లియర్ చేసుకోవాలన్న వ్యూహంతో కాషాయ పార్టీ ముందడుగు వేస్తోంది. అందుకుగాను తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేననేది ఈ ఎన్నికలతో నిరూపించుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
Also Read: BJP Telangana: బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిత్యం ఫిర్యాదులు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమలం ..!
ఎమ్మెల్యే అభ్యర్థులదే ఛాయిస్!
లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా సింగిల్‌గానే, అన్ని స్థానాల్లో పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరిగే ఎన్నికలు కావు. దీంతో, వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ వరకు పార్టీ ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఎవరు నిర్ణయించాలనే దానిపై పార్టీలో చర్చసాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వారికే బాధ్యతను అప్పగించాలని భావిస్తున్నారు. పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన నేతలు నిరుత్సాహంలో కొట్టుమిట్టాడుతున్నారు. వచ్చే ఎన్నికలకు కేడర్‌ను సమాయత్తం చేసుకునే పనిని పూర్తిగా వారికే అప్పగించాలని యోచిస్తున్నారు. కాగా భవిష్యత్‌లో రాబోయే లోకల్ బాడీ ఎన్నికలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు గతంలో పార్లమెంట్ స్థానాల నుంచి, అసెంబ్లీ, మండలి నుంచి పోటీ చేసిన అభ్యర్థులందరితో మంగళవారం భేటీ అవ్వనున్నారు. పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
అలాంటి స్థానాల్లో పార్టీని బలోపేతం
తెలంగాణలో బీజేపీకి దాదాపు 40 లక్షలకు పైగా సభ్యత్వాలు ఉన్నా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో మాత్రం పార్టీ చాలా బలహీనంగా ఉంది. అలాంటి స్థానాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా కమలం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చూస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాషాయదళం చతికిలపడింది. అందులో నుంచి బయటపడాలంటే కేడర్‌లో జోష్ నింపేలా ప్రణాళికలు ఉండాలని భావిస్తోంది. కేడర్‌ను లీడర్లుగా మార్చేందుకు ఈ ఎన్నికలకు వాడుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు. పార్టీ కేడర్‌లో జోష్ నింపేలా కార్యక్రమాలను రూపొందించాలని పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ.. ‘ప్రజా వంచన పాలన’ పేరిట ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని పార్టీ సమలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ ఫార్మూలా ఎంతమేర సక్సెస్ అవుతుందనేది వేచి చూడాలి.
Also Read: BJP Telangana: బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిత్యం ఫిర్యాదులు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమలం ..!

