Salary Delay: తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బంది ఆర్తనాదాలు పెడుతున్నారు. దాదాపు 6 నెలలుగా వారి వేతనాలు అందక దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఆరు నెలలుగా వేతనాలు అందక తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎటువంటి ముందడుగు పడలేదని, దీంతో సిబ్బంది కుటుంబ పోషణ భారమై దుర్భర జీవితం గడుపుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉర్దూ భాషాభివృద్ధి(Urdu language development), సంస్కృతి పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటైన అకాడమీ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ క్లియరెన్స్ లభించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెబుతున్నారు.
నెలల వేతనాలు పెండింగ్
తెలంగాణ ఉర్దూ అకాడమీలో దాదాపు 129 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా వారికి 6 నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. చాలీచాలనీ వేతనంతో కాలం వెళ్లదేసే వారికి దాదాపు 6 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జీతాలే ఆధారంగా బతుకుతున్న ఉద్యోగులు అద్దెలు చెల్లించలేక, నిత్యావసరాలు కొనలేక, పిల్లల ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఉన్నతాధికారుల దృష్టికి సిబ్బంది తీసుకెళ్లారు. అయినప్పటికీ, సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఉర్దూ అకాడమీలో వేతనాల సమస్యలు తలెత్తాయి. బడ్జెట్ కొరత లేదా నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఉద్యోగులు ఎప్పుడూ ఆందోళన చెందాల్సి వస్తోంది.
Also Read: Medchal: వెంచర్ కోసం నాలా కబ్జానా? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నట్లు!
తీవ్ర ఇబ్బందులు
మొన్నటి వరకు మైనారిటీ కార్పొరేషన్ నుంచి తమ మదర్ డిపార్ట్ మెంట్ అయిన ఉర్దూ అకాడమీకి పంపించాలని 129 మంది ఉద్యోగులకు డిమాండ్ చేశారు. కాగా ఇటీవల వారిని తమ మదర్ డిపార్ట్ మెంట్ కు మార్చినా వేతనాల ఇష్యూ మాత్రం క్లియర్ అవ్వలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నో ఏండ్లుగా వారు పనిచేస్తున్నా వేతనాలు పెంచకపోవడంతో చాలీచాలని జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. దీంతో కనీస వేతనాలు అమలుచేయాలనే డిమాండ్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. జీవో 60ని అమలు చేసి కనీస వేతనాలు అందించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఉర్దూ అకాడమీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం త్వరలో స్పందించి, వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ఆశిస్తున్నారు. మరి సర్కార్, ఉన్నతాధికారులు ఈ సమస్యను పరిష్కరించి వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతారా? మరింత ఆలస్యం చేసి దుర్భరంగా మారుస్తారా? అనేది చూడాలి.
Also Read: Dharma Mahesh: కాంట్రవర్సీ హీరో ధర్మ మహేష్.. తన కొడుకు బర్త్‌డే రోజు ఏం చేశాడంటే?

