Nidhhi Agerwal: అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ ప్రమోషన్ కేసులో నటి నిధి అగర్వాల్ శుక్రవారం హైదరాబాద్‌లోని CID కార్యాలయానికి హాజరయ్యారు. విచారణ కోసం హాజరవ్వాలని CID ముందుగా నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆమె విచారణ అనంతరం కార్యాలయం బయటకు వచ్చిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదే కేసులో ఇటీవల పలువురు సినీ ప్రముఖులపై విచారణ కొనసాగుతుంది. నవంబర్ 15న ఈ కేసు నేపథ్యంలో నటుడు రానా దగుబాటి SIT కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం మాట్లాడుతూ రానా, “గేమింగ్, గేమింగ్ యాప్స్ గురించి ప్రజలకు సరైన సందేశం వెళ్లేలా సరికొత్త మార్గాలు ఉపయోగించాలి. చట్టపరమైన ప్రక్రియ తర్వాత జరుగుతుంది. కానీ, నేను అవసరమైనంత సహకారం అందిస్తాను,” అని చెప్పారు.రానా ఈ కేసుకు సంబంధించిన ప్రశ్నలపై Enforcement Directorate (ED) ఎదుట కూడా గత ఆగస్టులో హాజరయ్యారు. జూలై 23న ED పంపిన సమన్ల ప్రకారం ఆయన హాజరుకావాల్సి ఉన్నా, షూటింగ్ షెడ్యూల్ కారణంగా అదనంగా సమయం కోరారు.
25 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు
ఈ సంవత్సరం స్టార్టింగ్లో తెలంగాణా పోలీసులు 25 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లపై అక్రమ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో FIR నమోదు చేశారు. ఈ జాబితాలో రానా దగుబాటి, ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మీ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ FIRను హైటెక్ సిటీకి సమీపంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేశారు. 32 ఏళ్ల వ్యాపారి పి.ఎం. ఫణీంద్ర శర్మ చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది.
యువతపై ప్రభావం పట్ల ఆందోళన
ఫిర్యాదు దారు శర్మ తన కమ్యూనిటీలోని యువతతో మాట్లాడినప్పుడు, సెలబ్రిటీల ప్రమోషన్ల ప్రభావంతో చాలామంది అక్రమ బెట్టింగ్ యాప్‌లలో డబ్బు పెట్టుబడి పెట్టారని పేర్కొన్నారు. తాను కూడా ఒక యాప్‌లో డబ్బు పెట్టాలని భావించగా, కుటుంబ సభ్యులు ఆపడంతో ఇలాంటి ప్రమాదకర యాప్‌లపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఫిర్యాదు ప్రకారం సెలబ్రిటీలు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని ఈ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రచారం చేస్తూ, ప్రజల్ని వారి కష్టార్జిత సంపాదనను ప్రమాదంలో పెట్టేట్టుగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
