Rajini and Kamal: దక్షిణాది సినీ పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ ఉన్న సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth), యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ (Kamal Haasan) కలిసి చేయాలనుకున్న ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ప్రస్తుతం గందరగోళంలో పడింది. ఈ దిగ్గజ నటుల కలయిక అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కావడం ఖాయం. కానీ, ఈ అద్భుతమైన కాంబినేషన్‌కు ఏమైందో ఏమోగానీ, సరైన దర్శకుడే దొరకడం లేదనే వార్తలు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ తన నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) ద్వారా ఈ సినిమాను నిర్మించడానికి మొదట రంగం సిద్ధం చేశారు. ఆరంభంలో, ప్రముఖ దర్శకుడు సుందర్ సి. ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోతున్నారని ప్రకటించారు. పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించారు. అయితే, ఊహించని విధంగా సుందర్ సి. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
Also Read- Harish Kalyan: హరీష్ కళ్యాణ్ నెక్ట్స్ ఫిల్మ్‌కు పవర్ ఫుల్ టైటిల్.. ప్రోమో అదిరింది
యువ దర్శకులపై దృష్టి!
సుందర్ సి. (Sundar C) తప్పుకున్న తర్వాత, స్టార్ హీరో ధనుష్ (Dhanush) ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. ధనుష్ ప్రస్తుతం నటుడిగా, దర్శకుడిగా మంచి ఫామ్‌లో ఉండటంతో, ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహం నింపింది. కానీ, ఆ వార్త కూడా నిజం కాలేదు. ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పుడీ ప్రాజెక్ట్ కోసం మరో ఇద్దరు యువ దర్శకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ‘పార్కింగ్’ అనే వైవిధ్యమైన చిత్రంతో పేరు తెచ్చుకున్న రామ్ కుమార్, అలాగే హీరో సూర్యతో సినిమా చేస్తున్న ఆర్‌జే బాలాజీ పేర్లు ఈ లిస్ట్‌లో చేరాయి. ఒకవైపు సూపర్‌స్టార్, మరోవైపు యూనివర్సల్ స్టార్ ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు, దర్శకుడి ఎంపిక విషయంలో నెలకొన్న ఈ కన్ఫ్యూజన్ సినీ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
Also Read- Actress Hema: నా కేసు కొట్టేశారు.. పోయిన నా పరువును తీసుకొచ్చిస్తారా?
సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం
ఒక సూపర్‌స్టార్ సినిమాకు దర్శకుడి విషయంలో ఇంతటి గందరగోళం నెలకొనడంపై నెటిజన్లు, ముఖ్యంగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘రజనీకాంత్‌ను డైరెక్ట్ చేయడానికి కోలీవుడ్‌లో దర్శకుడే లేడా?’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంత పెద్ద కాంబినేషన్‌ను హ్యాండిల్ చేయగల సామర్థ్యం, విజన్ ఉన్న దర్శకుడి కోసం కమల్ హాసన్ ప్రత్యేకంగా వెతుకుతున్నారని, అందుకే ఈ ఆలస్యం జరుగుతోందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, రజనీకాంత్-కమల్ హాసన్ కలయికలో సినిమా రావాలనేది కోట్లాది మంది అభిమానుల కల. ఆ ప్రాజెక్టును ఎవరు డైరెక్ట్ చేసినా, అది ఒక మైలురాయిగా నిలవాలని అంతా కోరుకుంటున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు త్వరలోనే సరైన దర్శకుడు దొరికి, అధికారిక ప్రకటన వెలువడాలని ఆశిద్దాం. కాదు, కూడదు అంటే, ఆ బాధ్యతలను కూడా కమల్ హాసనే తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. చూద్దాం.. ఏం జరుగుతుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
