Kodanda Reddy: ధరణి పేరుతో దగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మండిపడ్డారు. మాజీ మంత్రి హరీశ్ రావు భూ భారతి చట్టం అమలు విషయంలో నిరాధార ఆరోపణలను రైతు కమిషన్ శుక్రవారం ఒక ప్రకటనలో ఖండించింది. హరీశ్ రావు లేవనెత్తిన అంశాలన్నీ బీఆర్ఎస్ పాలనలోనే జరిగాయన్నారు. మీ తప్పిదాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై రుద్దడం తగదని కోదండ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి చేసిన దాష్టీకాల వల్ల భూ సమస్యలతో రైతులు సతమతం అయ్యారని, సమస్యల పరిష్కారానికి మార్గం లేక కోర్టుల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు.
భూ భారతితోనే మేలు
గత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సంబంధించి భూ రికార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా నెంబర్లను అమెరికా కంపెనీ(టేరాసా)కి అప్పగించిందని కోదండ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించినట్లుగానే భూ భారతి చట్టం తెచ్చి, యుద్ధ ప్రాతిపదికన అమల్లోకి తెచ్చారన్నారు. కంప్యూటర్ల చుట్టూ, కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతాంగం వద్దకే రెవెన్యూ అధికారులను పంపి దరఖాస్తులను తీసుకున్నారన్నారు.
సాదాబైనామా దరఖాస్తులను స్వీకరించి, అప్పటి ప్రభుత్వం పరిష్కారాన్ని గాలికి వదిలేస్తే ఈ ప్రభుత్వం భూ భారతిలో ఈ విషయాన్ని చేర్చడమే కాక, హైకోర్టు స్టే ఎత్తివేసేలా కృషి చేసి సాదాబైనామా క్రమబద్దీకరణ ప్రక్రియను ప్రారంభించిందన్నారు. ప్రైవేట్ చేతుల్లో ఉన్న ధరణి పోర్టల్‌ను ప్రభుత్వ రంగ సంస్థ ఐనానిక్‌కు అప్పగించిందన్నారు. భూ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయడానికి గ్రామ స్థాయిలో గ్రామ పరిపాలన అధికారులను, మండల స్థాయిలో లైసెన్స్ సర్వేయర్లను నియమించారని వివరించారు. గడిచిన 6 నెలల కాలంలో భూ భారతి అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు.
Also Read: Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి.. రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
రైతుల కోసం ప్రభుత్వం కృషి
కమిషన్ కార్యాలయానికి ఇప్పటివరకు వచ్చిన 3 వేల మంది రైతులకు పరిష్కార మార్గాలు సూచించడమే కాక, స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశామని కోదండ రెడ్డి వివరించారు. లక్షల్లో పేరుకుపోయిన సమస్యల పరిష్కారం జరగాలంటే క్షేత్ర స్థాయి యంత్రాంగం పటిష్టంగా పని చేయాలన్నారు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు, అనుభవాల ఆధారంగా తగిన మార్పులు చేర్పులు చేయాలని, కానీ గత ప్రభుత్వం ఇవేమీ చేయకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు వచ్చాయన్నారు. ప్రతి నిత్యం రైతుల భూ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు.
సీఎం రేవంత్ కృషి వల్లే..
ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ కూడా భూమి ఉండి హక్కు లేకుండా ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదని కోదండ రెడ్డి అన్నారు. అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న పేద రైతులకు పట్టాలిచ్చిందని గుర్తు చేశారు. అంతేకాక సమస్య ఉన్న ప్రతి రైతుకు గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సదస్సులు నిర్వహించి పరిష్కారం చూపిందన్నారు. రైతు కమిషన్ సభ్యుడు సునీల్ సైతం హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల దరఖాస్తులు, గత ప్రభుత్వంలో దరఖాస్తులు తీసుకొని పెండింగ్‌లో ఉన్న 9 లక్షల సాదాబైనామాల దరఖాస్తుల పరిశీలన కూడా మొదలైందని తెలిపారు. ఈ సాదాబైనామాల అమలుకు అవరోధంగా ఉన్న కోర్టు కేసులను కూడా పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో భూమి ఉన్న ప్రతి రైతుకు హక్కు కల్పించేలా చట్టం తేవడం, దాన్ని పకడ్బందీగా అమలు చేయడం ఆయన దృఢ సంకల్పానికి నిదర్శనం అని అన్నారు.

