Thummala Nageswara Rao: ఏడాదిన్నరలోనే వెయ్యి కోట్ల రూపాయలు చేనేత రంగానికి విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) తెలిపారు. చేనేత రంగానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహర్దశ పట్టనున్నదని అన్నారు. గత ప్రభుత్వంలో రాజకీయ స్వార్థంతో హడావుడిగా పథకాలు ప్రారంభించి వదిలేశారని మండిపడ్డారు. నాంపల్లి చేనేత భవన్‌లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ సంస్థ ప్రయోగశాలను శుక్రవారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వెంకటగిరిలో ఐఐఎచ్‌టీ ఉన్నదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ చేనేత రంగానికి మేలు జరిగేలా కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి ఒప్పించి ఐఐఎచ్‌టీ మన రాష్ట్రానికి సాధించారన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గౌరవార్ధం ఆయన పేరున పెట్టారని, బాపూజీ కీర్తి ప్రతిష్ఠలు పెరిగేలా ఐఐఎచ్‌టీ దేశంలోనే మంచి ఇన్‌స్టిట్యూట్‌గా నిలవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
నేతన్నలకు చేతి నిండా పని
ఇందిరా మహిళా శక్తి చీరల ఆర్డర్‌తో చేనేత కార్మికులు పని కోసం ఎదురు చూడకుండా చేతినిండా పని కల్పించామని తుమ్మ అన్నారు. రూ.50 కోట్లతో వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేసి ఇప్పటికే 2,368 మెట్రిక్ టన్నుల నూలు మర మగ్గాల సంఘాలకు సరఫరా చేశామని తెలిపారు. రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు, నేతన్న భరోసా పథకాలను అమలు చేశామన్నారు. నేతన్న పొదుపు కింద రూ.304 కోట్లు, మర మగ్గాల కార్మికులకు పొదుపు కింద రూ.68 కోట్లు విడుదల చేసినట్లు వివరించారు.
బకాయిలు రూ.40 కోట్లు
మర మగ్గాల కార్మికులకు నూలు సబ్సిడీ పథకం కింద ఉన్న బకాయిలు రూ.40 కోట్లు చెల్లించామన్నారు. చేనేత కార్మికుల వ్యక్తిగత రుణమాఫీ రూ.33 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి చీరలు గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షలు పంపిణీ చేస్తున్నామన్నారు. పుట్టింటి కానుకగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్‌లూమ్ అండ్ టెక్స్‌టైల్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్, అధికారులు పాల్గొన్నారు.
