Yadadri Bhuvanagiri: ఈ ప్రపంచంలో వెలకట్టలేని ప్రేమ ఏదైనా ఉందంటే అది తల్లిదండ్రులదే. బిడ్డల ఎదుగుదల కోసం.. పేరెంట్స్ ఎన్నో త్యాగాలు చేస్తారు. మంచి భవిష్యత్తును అందించేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. తమ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఉన్నదంతా బిడ్డలకే దారదత్తం చేస్తుంటారు. అలాంటి తల్లిదండ్రుల పట్ల కొందరు బిడ్డలు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వయసు పైబడిందన్న ఆలోచన కూడా లేకుండా నిర్దాక్షణ్యంగా రోడ్డున పడేస్తున్నారు. తెలంగాణలోనూ ఓ దుర్మార్గపు కుమారుడు ఇలాంటి చర్యకే పాల్పడగా.. కలెక్టర్ సరైన రీతిలో బుద్ధి చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే..
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri) కలెక్టర్ హనుమంతరావు (Collector Hanumantha Rao) చేసిన పనిపై సర్వత్రా ప్రసంశలు కురుస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వలిగొండ మండలం ఆరూరు గ్రామానికి చెందిన కందాడి జనార్ధన్ రెడ్డి (80) దంపతులు.. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి వచ్చారు. తన పేరిట ఉన్న 18 ఎకరాల 16 గుంటల భూమిని కుమారుడికి రాసిచ్చానని.. తన ఆస్తి తీసుకోని తమను పట్టించుకోవడం లేదని వృద్ధ జంట వాపోయింది. ఈ వయసులో ఏమి చేయలేని దిక్కుతోచని స్థితిలో ఉన్నామని.. తమకు మీరే న్యాయం చేయాలని కలెక్టర్ ను వేడుకుంది.
కలెక్టర్ కీలక ఆదేశాలు..
అంతే కాదు ‘మెయింటెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద పేరెంట్స్ 2007 చట్టం’ ప్రకారం గిఫ్ట్ డీడ్ గా కుమారుడికి ఇచ్చిన భూమిని తిరిగి తమకు ఇప్పించాలని కలెక్టర్ కు జనార్ధన్ రెడ్డి దంపతులు విన్నవించుకున్నారు. కుమారుడిపై వారు చేసిన ఆరోపణలు నిజమేనని నిర్ధారించుకున్న కలెక్టర్.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రుల భూమిని తీసుకొని పట్టించుకోకుండా ఉన్న కారణంగా గిఫ్ట్ డీడ్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read: Viral Video: మగవాళ్ళు కూడా ఇంత ఘోరంగా ఏడుస్తారా? ‘ మెన్ క్రై టూ ‘ హ్యాష్ ట్యాగ్ తో వీడియో వైరల్
కలెక్టర్.. స్ట్రాంగ్ వార్నింగ్
తల్లిదండ్రుల సంరక్షణ పట్ల పిల్లలు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు సూచించారు. దానిని విస్మరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా కలెక్టర్ ఆదేశాల నేపథ్యంలో.. 18 ఎకరాల 16 గుంటల భూమి తిరిగి కందాడి జనార్ధన్ రెడ్డి (80) దంపతులకు దక్కనుంది. ఆ భూమి ద్వారా వచ్చే కౌలు డబ్బులతో ఆ వృద్ధ జంట హాయిగా జీవించేందుకు మార్గం సుగమం అవుతుందని బంధువులు చెబుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కుమారుడికి కలెక్టర్ హనుమంతరావు తగిన బుద్ది చెప్పారని ప్రశంసిస్తున్నారు.
