Komatireddy Venkat Reddy: సినిమా మాధ్యమానికి ఎల్లలు లేవని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. తెలంగాణ నార్త్ ఈస్ట్ సినిమా ఉత్సవాల్లో భాగంగా సాయంత్రం ఐమాక్స్ థియేటర్ లో ప్రాంతీయ భాష చిత్రాల దర్శకులు, నిర్మాతలు నటీనటులు తదితర డెలిగేట్స్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి మంత్రి కోమటిరెడ్డి మెమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అనేక చారిత్రక వారసత్వ కట్టడాలు, ప్రకృతి వైవిధ్యం ఉందని, సినిమా నిర్మాణాలకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు పేర్కొన్నారు.
హాలీవుడ్ తో పోటీపడి ఆస్కార్ అవార్డులు
సినిమా రంగానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. తెలుగు సినిమాలు హాలీవుడ్ తో పోటీపడి ఆస్కార్ అవార్డులు సాధించాయని వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత స్టూడియోలు, నిర్మాణ వసతులు హైదరాబాదులో ఉన్నాయని పేర్కొన్నారు. సినిమా నిర్మాణానికి తెలంగాణను మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఈశాన్య భారత సినిమాలు తీసేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
చలనచిత్ర అభివృద్ధి సంస్థ తెలంగాణ
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ సమక్షంలో అస్సాం రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంస్థల మధ్య చేసుకున్న అవగాహన ఒప్పందాన్ని పరస్పరం అందజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టి జి ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు, అస్సాం అడిషనల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ బి కళ్యాణ్ చక్రవర్తి, సిక్కిం రాష్ట్ర ఎఫ్ డి సి చైర్మన్ సిమంత శేఖర్, ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, తెలంగాణ ఎఫ్డిసి ఎండి సిహెచ్ ప్రియాంక, అస్సాం ఎఫ్ డి సి ఎండి ప్రశాంత్ బారువా తదితరులు పాల్గొన్నారు.
Also Read: Komatireddy Venkat Reddy: కాళేశ్వరం మీరే కట్టారు.. మీరే కూల గొట్టారు.. హరీష్ రావుపై మంత్రి ఫైర్!
