IBomma: టాలీవుడ్‌లో అతిపెద్ద పైరసీ సంస్థగా పేరుగాంచిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (Immadi Ravi) అరెస్ట్ అయిన తర్వాత కూడా ఈ వివాదం చల్లారడం లేదు. రవి అరెస్టయినా, ఐబొమ్మ వన్ (Ibomma One) పేరుతో మరో వెబ్‌సైట్ పుట్టుకొచ్చి పోలీసులకు సవాల్ విసరడం, తాజాగా ఎస్‌బీఐ ఇన్సూరెన్స్ వంటి ప్రధాన సంస్థ వెబ్‌సైట్‌లోనూ సినిమాలు దర్శనమిచ్చాయనే వార్తలు.. పైరసీ భూతం ఎంత లోతుకు పాతుకుపోయిందో తెలియజేస్తున్నాయి. అయితే, ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్న విషయం ఏంటంటే… పైరసీకి పాల్పడిన వ్యక్తికి సామాన్యుల నుంచి మద్దతు పెరగడం. ఐబొమ్మ ఉచితంగా వినోదాన్ని అందిస్తోందనే ఒకే ఒక్క కారణంతో రవిని సమర్థిస్తున్న వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని పలువురు సైబర్ నిపుణులు, నెటిజన్లు తీవ్ర ప్రశ్నలను సంధిస్తున్నారు. ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రైవసీకి సంబంధించిన అంశాలను లేవనెత్తుతున్నారు.
Also Read- Tollywood: ట్రెండ్ మారింది.. సినిమా పబ్లిసిటీకి స్టార్స్ అవసరం లేదు.. ఆ పాత్ర కూడా జర్నలిస్ట్‌లదే!
ప్రశ్నాస్త్రాలు ఇవే
డేటా భద్రత: మీరు మీ వ్యక్తిగత సమాచారం, మీ ఐపీ అడ్రస్‌లు, బ్రౌజింగ్ హిస్టరీ మొత్తం ఒక పైరసీ చేసే వ్యక్తి చేతుల్లో పెట్టి సినిమాలు చూస్తున్నారు. రేపు మీ సిస్టమ్స్ లేదా మీ వ్యక్తిగత ఖాతాలు హ్యాక్ అయితే, మీరు పోలీసులను సంప్రదించకుండా ఉండగలరా? ఉచిత వినోదం కోసం మీ భద్రతను పణంగా పెడతారా?
చట్టపరమైన చిక్కులు: ఐబొమ్మ వంటి పైరసీ వెబ్‌సైట్‌లను వినియోగించడం చట్టవిరుద్ధం. రేపు మీ ఐడీ లేదా నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఏదైనా తీవ్రమైన సైబర్ క్రైమ్ జరిగితే, మీరు కూడా చట్టపరమైన చిక్కుల్లో ఇరుక్కోవలసి వస్తుంది. ఆ రోజు కూడా ఈ వెబ్‌సైట్‌కు మద్దతుగా నిలబడతారా?
క్రైమ్‌కు సపోర్ట్: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఒక వ్యక్తిని, ఒక సంస్థను సమర్థించడం ఎంతవరకు సమంజసం? ఈరోజు ఉచితంగా సినిమా దొరికింది కాబట్టి సపోర్ట్ ఇస్తున్నారు. రేపు అదే వ్యక్తి వల్ల మీకు బాధ కలిగితే లేదా నష్టం జరిగితే కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారా?
సైబర్ నిపుణుల హెచ్చరికలు
సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, పైరసీ వెబ్‌సైట్‌లు కేవలం కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా, యూజర్ల వ్యక్తిగత భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతాయి. ఈ వెబ్‌సైట్‌లలో తరచుగా హానికరమైన మాల్‌వేర్ (Malware), ఫిషింగ్ లింకులు (Phishing Links) దాగి ఉంటాయి. ఉచితంగా సినిమా చూసే ప్రయత్నంలో, యూజర్లు తమ డివైజ్‌లలోకి వైరస్‌లను ఆహ్వానించి, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని దొంగిలించుకునే ప్రమాదం ఉంది. ఉచితంగా ఏదైనా లభిస్తోంది అంటే, మీ డేటా వాళ్ల చేతుల్లోకి వెళుతుందని అర్థం. మీ డేటానే వారి అస్త్రం అని గుర్తించాలి. వినోదం కోసం చట్టాన్ని, భద్రతను పణంగా పెట్టడం అనేది దీర్ఘకాలంలో తీరని నష్టాన్ని మిగులుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

