Formula E Race Case: ఫార్ములా ఈ-కారు రేసు కేసుకు సంబంధించి కేటీఆర్ ను విచారించేందుకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చాలా రోజుగా చలనం లేకుండా ఉన్న ఫార్ములా ఈ-కారు కేసు ఒక్కసారిగా రాజకీయ హీట్ ను పెంచింది. ఏసీబీ అధికారులు కేటీఆర్ పై చార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవినీతికి సంబంధించి ఇప్పటికే స్ఫష్టమైన ఆధారాలను సేకరించామని ఏసీబీ (ACB) వర్గాలు చెబుతుండటంతో.. అతి త్వరలోనే ఆయన అరెస్టు కూడా ఉంటుందన్న ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. అయితే ఇక్కడ కూడా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. గేమ్ ఛేంజర్ గా మారే అవకాశముందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
ఈ-కారు రేస్ కేసు ఏంటీ?
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నపుడు 2023లో ఈ ఫార్మూలా కారు రేసు హైదరాబాద్ లో జరిగిన విషయం తెలిసిందే. అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ రేసును హైదరాబాద్ లో నిర్వహించారు. కాగా 2024లో రెండో ఎడిషన్ రేసు జరగాల్సి ఉండగా స్పాన్సర్ గా ఉన్న గ్రీన్ కో కంపెనీ కాంట్రాక్ట్ నుంచి తప్పుకొంది. దాంతో హెచ్ఎండీఏ.. రూ. 54.88 కోట్లను లండన్ లోని ఫార్మూలా రేసింగ్ కంపెనీ ఎఫ్ఈవో ఫార్మూలా ఈ – ఆపరేషన్ లిమిటెడ్ కు బదిలీ చేశారు. అయితే విదేశీ మారకద్రవ్యం రూపంలో చెల్లించడంతో వివాదం చెలరేగింది. నిబంధనల ప్రకారం.. రూ.10 కోట్ల మించి విదేశీ కరెన్సీలో నగదు చెల్లింపులు చేయాలంటే కేంద్ర ఆర్థిక శాఖ, రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. కానీ ఈ లావాదేవీలకు హెచ్ఎండీఏ పర్మిషన్ తీసుకోలేదు. అంతేకాదు ఆ సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ బేఖాతరు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా విదేశీ కంపెనీకి ఇష్టానుసారంగా చేసిన చెల్లింపుల కారణంగా హెచ్ఎండీఏకు అదనంగా రూ.8.06కోట్ల పన్ను భారం కూడా పడినట్లు ఏసీబీ పేర్కొంది.
విచారణలో ఒప్పుకున్న కేటీఆర్..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారం బయట పడటంతో ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారం బయట పడటంతో ఏసీబీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంట్లో కేటీఆర్ ను ప్రధాన నిందితునిగా పేర్కొన్నారు. ఆ తరువాత అప్పట్లో హెచ్ఎండీఏకు కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ ఛీఫ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్స్) బీ.ఎల్.ఎన్.రెడ్డి, మాజీ ప్రత్యేక అధికారి కిరణ్ కుమార్ లను నిందితులుగా చేర్చారు. ఏసీబీ అధికారులు అరవింద్ కుమార్ ను విచారించినపుడు కేటీఆర్ ఆదేశాల మేరకే చెల్లింపులు జరిపినట్టు వెల్లడించారు. దీనిని కేటీఆర్ స్వయంగా నిర్ధారించారు. చెల్లింపులు జరపాలని తానే ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రకటన చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఆయనను నాలుగుసార్లు ఏసీబీ కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపారు.
ఆధారాలతో గవర్నర్ కు నివేదిక
ఈ వ్యవహారంలో వచ్చిన క్విడ్ ప్రో కో జరిగిందన్న ఆరోపణలపై కూడా కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో 50కోట్ల రూపాయలు వచ్చిన వ్యవహారంపై దర్యాప్తు చేశారు. కారు రేసింగ్ కోసం చేసుకున్న కాంట్రాక్ట్ డాక్యుమెంట్లు, ఫైనాన్షియల్ రికార్డులను పరిశీలించారు. ఈ క్రమంలో కొన్ని సాక్ష్యాధారాలను కూడా సేకరించారు. వాటిని గవర్నర్ కు నివేదిస్తూ కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి ఇవ్వాలని లిఖితపూర్వకంగా కోరారు. కేటీఆర్ పాత్రపై సాక్ష్యాలు ఉన్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా గవర్నర్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ ను అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 17 ప్రకారం ప్రాసిక్యూట్ చేయటానికి అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు త్వరలోనే కోర్టుకు ఛార్జీషీట్ సమర్పించనున్నట్టు సమాచారం.
Also Read: CM Revanth Reddy: తెలంగాణ, నార్త్ ఈస్ట్ కనెక్ట్ కార్యక్రమంలో సీఎం.. ప్రత్యేక భవనాల నిర్మాణంపైనా ప్రకటన!
గవర్నర్ కోర్టులో బంతి..!
అయితే కేటీఆర్ పై చార్జ్ షీటు దాఖలు చేసిన అనంతరం.. ఆయన్ను ఏసీబీ అరెస్టు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం ఉపందుకుంది. అయితే ఈ పంచాయతీ మరోమారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కోర్టుకు వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేసీఆర్.. ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ తో పాటు గవర్నర్ అనుమతి తప్పనిసరి అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రాసిక్యూషన్ చేసే ముందు ఎలాగైతే గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరిందో.. అరెస్టుకు సైతం అదే పద్దతిని అవలంభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? లేదా ఏడాది పాటు దీనిని సాగదీస్తారా? అన్నది ఆసక్తికరంగా మారనుంది.
