Jagan – Nampally Court: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసుకు సంబంధించి నాంపల్లి సీబీఐ కోర్టులో జరిగే విచారణకు ఆయన హాజరయ్యారు. దాదాపు ఆరేళ్ల తర్వాత జగన్ ఇలా ప్రత్యక్షంగా కోర్టుకు హాజరవుతున్నారు. ఏపీ సీఎం అయిన తర్వాత ఆయన చివరిగా 2020 జనవరి 10న నాంపల్లి కోర్టుకు రావడం గమనార్హం.
తరలివచ్చిన అభిమానులు..
చాలా కాలం తర్వాత వైఎస్ జగన్.. నాంపల్లి కోర్టుకు రావడంతో ఆయన అభిమానులు తరలివచ్చారు. దీంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తల తాకిడి కనిపించింది. అంతకుముందు విజయవాడలోని గన్నవరం, హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్ట్స్ వద్దకు సైతం జగన్ అభిమానులు పోటెత్తారు. కేసు విచారణకు హాజరవుతున్న క్రమంలో తామంతా ఉన్నామంటూ జగన్ కు భరోసా కల్పించారు.
పట్టిష్ట బందోబస్తు..
వైసీపీ అధినేత రాక నేపథ్యంలో నాంపల్లి కోర్టులో భద్రతను మరింత పటిష్టం చేశారు. కోర్టు లోపలికి వచ్చే రెండు మార్గాలను పోలీసులు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. న్యాయవాదులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. జగన్ కేసు విచారణ పూర్తయ్యే వరకూ బయటివారిని లోనికి అనుమతించే పరిస్థితి లేదని పోలీసు వర్గాలు తెలిపాయి.
Also Read: Formula E Race Case: ఫార్ములా ఈ – కారు కేసులో బిగ్ ట్విస్ట్.. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి
తల్లిని కలవనున్న జగన్..
నాంపల్లి సీబీఐ కోర్టు విచారణ ముగిసిన అనంతరం వైఎస్ జగన్.. నేరుగా హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. అక్కడ తల్లి విజయమ్మను జగన్ కలుసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఈసారి కూడా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే సీబీఐ ఇందుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు.. జగన్ విచారణకు రావాల్సిందేనని ఆదేశించింది.
రప్ప రప్ప ఫ్లకార్డులు
జగన్ రాకతో నాంపల్లి కోర్టుకు తరలివచ్చిన వైసీపీ అభిమానులు.. అత్యుత్సాహం ప్రదర్శించారు. మరోమారు రప్ప రప్ప ఫ్లకార్డులను ప్రదర్శించారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లు చూపిస్తూ నినాదాలు చేశారు. దీంతో మరోమారు పుష్ప డైలాగ్ చర్చకు దారి తీసింది. వైసీపీ పెద్ద ఎత్తున తరలిరావడంతో నాంపల్లి కోర్టు పరిసర మార్గాల్లో ట్రాఫిక్ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ కు జగన్ రాక.. కలకలం రేపుతున్న రప్ప రప్ప పోస్టర్లు.. pic.twitter.com/pBWllqFUuQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 20, 2025
