Congress Party: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అలక రాష్ట్ర కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. రెండు రోజులుగా ఆయన బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతున్నా చర్చలు సఫలీకృతం కాకపోవడంతో అధిష్టానం నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. బుధవారం సాయంత్రం తెలంగాణ భవన్ శబరి బ్లాక్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ దీపాదాస్ మున్షి, మంత్రి శ్రీధర్ బాబులతో జీవన్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌లు భేటీ అయ్యారు.
అనంతరం, మంత్రి శ్రీధర్ బాబు కారులో జీవన్ రెడ్డి ఏఐసీసీ పెద్దలను కలవడానికి బయల్దేరి వెళ్లిపోయారు. దీపాదాస్ మున్షి కూడా వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో ఈ ముగ్గురు సమావేశం కానున్నారు. ఈ భేటీలోనే జీవన్ రెడ్డి తన డిమాండ్లను వినిపించే అవకాశం ఉన్నది. సీనియర్ నాయకుడు, కష్టకాలంలో పార్టీ వెంటే ఉన్న జీవన్ రెడ్డికి ఏఐసీసీ బంపరాఫర్ ఇవ్వనూ వచ్చని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులు, పార్టీ పదవికి ఉన్న పోటీ, మంత్రివర్గ విస్తరణలో ఉన్న అవకాశాలను బట్టి ఏఐసీసీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఏది ఏమైనా.. ఈ భేటీ తర్వాత జీవన్ రెడ్డి తన భవిష్యత్ కార్యచరణఫై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.