Bandi Sanjay: హిందుత్వమే తన శ్వాసని.. తెలంగాణలో రామరాజ్యం తెస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ సంజయ్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ లో కరీంనగర్ స్థాయి స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ ‘హిందుత్వమే నా శ్వాస, నా నోటి నుండి హిందుత్వం ఆగిపోతే ఆ రోజే నా శ్వాస ఆగిపోయినట్లు’ అని స్పష్టం చేశారు. హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి రామరాజ్యాన్ని స్థాపిస్తామని ప్రకటించారు.
‘నేను మతతత్వవాదినే’
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 నుండి 48 సీట్లు గెలవడానికి, తాను కరీంనగర్ ఎంపీగా విజయం సాధించడానికి హిందుత్వమే కారణమని బండి సంజయ్ గర్వంగా చెప్పారు. ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ ఎన్నికలొస్తే మసీదుల్లో ముస్లింలంతా ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తున్నారన్నారు. వారు ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. 12 శాతం ముస్లింలు ఒక్కటై ఓటు బ్యాంకుగా మారితే తప్పు లేనిది, 80 శాతం హిందువులు ఏకమై ఓటు బ్యాంకుగా మారితే తప్పేంటని ఆయన సూటిగా ప్రశ్నించారు. ‘నేను బరాబర్ మతతత్వ వాదినే’ అని ధైర్యంగా ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
‘కాంగ్రెస్ నయాపైసా ఇవ్వలేదు’
ఇదే హిందుత్వ వాదంతో గడపగడపకూ తిరుగుతానని బండి సంజయ్ తెలిపారు. ముస్లిం మహిళలకు మేలు చేసే ట్రిపుల్ తలాక్ రద్దును కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు వ్యతిరేకించాయని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ కేవలం కేంద్ర నిధుల కోసమే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏ పంచాయతీకి కూడా నయాపైసా ఇవ్వలేదని సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే పంచాయతీలకు నిధులు రావని అన్నారు. పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని, అందుకే బీజేపీని గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని బండి సంజయ్ పేర్కొన్నారు.
‘నిధులు తెచ్చే బాధ్యత నాది’
బీజేపీని గెలిపిస్తే పంచాయతీలకు నిధులు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని బండి సంజయ్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ ఫెస్టివల్’ నిర్వహించడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. ఇది ‘తెలంగాణ డౌన్ ఫాల్ ఫెస్టివల్’ అని విమర్శించారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర డిక్లరేషన్లు (వరంగల్, యూత్, ఎస్సీ/ఎస్టీ, కామారెడ్డి) ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలు, పదేళ్ల బీఆర్‌ఎస్ వైఫల్యాలను వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
Also Read: Telangana Weather: చలితో అల్లాడుతున్న ప్రజలకు గుడ్ న్యూస్.. వాతావరణ శాఖ తీపి కబురు!
26న సంతకాల సేకరణ
కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 26న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ‘సంతకాల సేకరణ’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని బండి సంజయ్ ప్రకటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ పై రూపొందించిన ‘బలిరా.. భళి భళిరే’ గీతాన్ని విడుదల చేయగా, బీజేపీ కార్యకర్తలు ఉత్సాహంగా చిందులేశారు. కాగా హిందుత్వంపై బండి చేసిన వాఖ్యలు ఈటల రాజేందర్ చేసిన వాఖ్యపై కౌంటర్ గా మాట్లాడినట్టు చర్చ సాగుతుంది.
