Swetcha Effect: మేడ్చల్ లో జోరుగా జరుగుతున్న గ్యాస్ రీ ఫిల్లింగ్ దందాపై స్వేచ్చ రాసిన కథనంపై అధికారులు స్పందించారు. గురువారం స్వేచ్చ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై దాడులు నిర్వహించారు. సివిల్ సప్లై అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నారు.
అంతకుముందు స్వేచ్చ దినపత్రికలో వచ్చిన కథనానికి భయపడి ముందు జాగ్రత్తగా కొందరు అక్రమార్కులు తమ షాపులను మూసేశారు. అయినప్పటికీ అధికారులు వారి షాపులపై దాడులు చేశారు. అనుమతులు లేకుండా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్న వారి షాపుల్లో సోదాలు నిర్వహించారు. అక్రమ గ్యాస్ సిలిండర్లతో పాటు షాప్ లను సీజ్ చేశారు. అనుమతి లేకుండా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
Also Read: CM Revanth Reddy: మహిళలకు సీఎం గుడ్ న్యూస్.. అమెజాన్‌తో సంప్రదింపులు.. డీల్ కుదిరితే డబ్బే డబ్బు!
మేడ్చల్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రధాన మార్కెట్ లోని ఒక భవనంలో సిలిండర్లను భద్రపరిచి, గ్యాస్ రీఫిల్లింగ్ దందా కొనసాగిస్తున్నారన్న సమాచారం స్వేచ్ఛ దృష్టికి వచ్చింది. జనావాసాల మధ్య ఈ దండా కొనసాగడం వల్ల జరిగరానిది జరిగితే పరిస్థితి ఏంటని స్వేచ్ఛ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దందాను సంబంధిత సివిల్ సప్లై అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు సైతం వ్యక్తమయ్యాయి. మేడ్చల్ ప్రధాన మార్కెట్ తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. గ్యాస్ విస్ఫోటనం జరిగినప్పుడు హడావుడి చేయకుండా ముందే అధికారులు చర్యలు తీసుకోవాలంటూ దీనిపై స్వేచ్ఛ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టడం గమనార్హం.
