Paddy Procurement: ఆరుగాలం పండించిన ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం మద్దతు ధర అందించేందుకు, కొనుగోళ్లను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నది. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడం, కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఇదేంటని అడిగితే తాలు, తేమ, బస్తా తూకం పేరుతో కోత విధిస్తున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
విచ్చలవిడిగా దోపిడీ
కాంగ్రెస్ ప్రభుత్వం సదుద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. మద్దతు ధరను సైతం ప్రకటించింది. కానీ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్ముకుందామని వెళ్లిన రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో ఒక్కో రకంగా తూకం వేయడం పరిపాటిగా మారింది. బస్తా తూకం పేరుతో 1.2 కిలోలు ఎక్కువగా కాంటా వేస్తున్నారు. ప్రతి కేంద్రంలో 40 కిలోల బస్తా తూకం వేస్తున్నారు. అయితే, బస్తా తూకం 250 గ్రాములు లేక 500 గ్రామాలు తీయాల్సి ఉంటుంది. కానీ ఏకంగా కిలో 200 గ్రామాలు తూకం తీస్తున్నారు. దీంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. అంటే క్వింటాకు 3 కిలోలకు పైగా అదనంగా కాంటా వేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు హమాలీ 40 కిలోల బస్తాకు 20 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే క్వింటాకు 50 రూపాయలు అన్నమాట. దీనికి అదనంగా కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు శుభ్రం చేసినందుకు ధాన్యం రాశి నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
సుతీల్(దారం) తెచ్చుకునేదీ రైతే
కాంటా వేసిన తర్వాత బస్తాలను కుట్టేందుకే రైతులే సుతీల్(దారం) తెచ్చుకుంటున్నారు. ఆ దారం ఖర్చులు ప్రభుత్వం ఇస్తున్నా కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇవ్వడం లేదు. ప్రతిసారి ఇదే తంతు జరుగుతున్నది. ఈ దారం భారం సైతం రూ.200 వరకు పడుతున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తున్నప్పటికీ అది ఇలాంటి ఖర్చులకే సరిపోతున్నదని అంటున్నారు.
Also Read: Viral Video: వామ్మో ఇదేం వింత.. కారు మిర్రర్ నుంచి బయటకొచ్చిన పాము.. వీడియో వైరల్
తేమ పేరుతో కట్
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుందామని వెళ్లిన రైతులకు నిరాశే ఎదురవుతున్నది. కాంటా వేసిన ధాన్యం మిల్లులకు పోయే సరికి తగ్గుతున్నదని నిర్వాహకులు కోత విధిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. కేంద్రాల్లో మ్యాశ్చర్ చూసి ధాన్యం కాంటా వేస్తున్నారు. అయినప్పటికీ మిల్లుల వద్దకు పోయే సరికి ఎలా తగ్గుతున్నదని రైతులు అడుగుతున్నారు. తాలు, వడ్లు సరిగ్గా లేవని, తూకం తక్కువగా ఉంటున్నదని మిల్లర్లు అంటున్నారని, అందుకే కోత విధిస్తున్నామని నిర్వాహకులు పేర్కొంటున్నట్లు రైతులు తెలిపారు. లారీలో 800 నుంచి 850 బస్తాలను లోడ్ చేస్తారు. ప్రతీ లోడ్‌కు 5 నుంచి 6 క్వింటాళ్లు కోత పెడుతుండడం గమనార్హం. అంటే ఒక్కో లారీకి రైతుల నుంచి రూ.12 వేల వరకు కాజేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. కొనుగోలు చేసేటప్పుడు లేని నిబంధనలు మిల్లులో దించేటప్పుడు ఎందుకు? మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కుమ్మక్కై లారీకి 5 నుంచి 6 క్వింటాళ్లు కోత విధిస్తున్నారా అనేది తేలాల్సి ఉన్నది.
పర్యవేక్షణ కరువు
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లను పర్యవేక్షించాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ కూడా తూకంలోగానీ, రైతులకు మౌలిక సదుపాయాల కల్పనలో గానీ లోటు ఉండొద్దని పేర్కొన్నది. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడం స్పష్టమవుతున్నది. జిల్లాల్లోని పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారులకు(డీడీ)లకు గానీ ఫోన్ చేస్తే సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు రసీదులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఈ నెల 12న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సచివాలయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లులకు పంపిస్తున్నారని, దించే వరకు రైతులను బాధ్యులుగా చేయడం సరైనది కాదని వివరించారు. మంత్రి ఉత్తమ్ అధికారులకు దీనిపై ఆదేశాలు సైతం జారీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా కనీస వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. కానీ క్షేత్రస్థాయిలో అధికారులు ఆదేశాలను పట్టించుకోడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోలు కేంద్రాలపై పర్యవేక్షణ పెడుతుందా లేదా చూద్దాం.
Also Read: Hyderabad IT Raids: పిస్తా హౌస్, షాగౌస్, మేఫిల్ హోటళ్లపై ఐటీ సోదాలు.. రూ. కోట్లలో హవాలా సొమ్ము!
