Tamil dubbed movies: తెలుగు ప్రజలు భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఎక్కడ దొరికినా దాన్ని ఆదరిస్తారు. ఒక సినిమా మంచి కంటెంట్ తో వస్తే తెలుగు ప్రజల ఆదరణ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇక్కడి సినిమాలు సరిపోవు అన్నట్లు కొరియన్ సినిమాలు కూడా చూసేస్తుంటారు. అలాంటిది కంటెంట్ ఉన్న పర భాష చిత్రాలు అక్కడి కంటే తెలుగులో హిట్ అవుతుండటంలో అతిశయోక్తి లేదు. తెలుగు సినిమా మార్కెట్ ఎంత పెద్దదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మన ప్రేక్షకులు మంచి కథ, కథనం ఉన్న ఏ సినిమానైనా ఆదరిస్తారు, అది స్ట్రెయిట్ సినిమా అయినా, డబ్బింగ్ సినిమా అయినా సరే! గత రెండు దశాబ్దాలలో, తమిళం ఇతర భాషల నుండి డబ్ అయిన కొన్ని సినిమాలు ఒరిజినల్ వెర్షన్ల కంటే తెలుగులోనే భారీ విజయాన్ని, ఎక్కువ వసూళ్లను సాధించి బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించాయి. ఈ సినిమాలకు తెలుగులో వచ్చిన సెన్సేషనల్ విజయాల వెనుక గల కారణాలను, వాటి ప్రభావాన్ని పరిశీలిద్దాం.
Read also-Hyper Aadi: సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి హైపర్ ఆది స్వీట్ వార్నింగ్.. ముందు ఇది పోవాలి..
1. అపరిచితుడు
ఒరిజినల్: అన్నియన్ (తమిళం)
దర్శకుడు శంకర్ అద్భుతమైన టేకింగ్, భారీ బడ్జెట్ అత్యున్నత నిర్మాణ విలువలు ఈ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా, హీరో విక్రమ్ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ పాత్ర తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళంలో విజయం సాధించినప్పటికీ, తెలుగులో ఈ సినిమా విక్రమ్‌కు తిరుగులేని స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టింది. అప్పటివరకు తెలుగులో డబ్బింగ్ సినిమాలకు లేని స్థాయిని ఈ చిత్రం అందించింది.
2. బిచ్చగాడు
ఒరిజినల్: పిచ్చైక్కారన్ (తమిళం)
హీరోగా విజయ్ ఆంటోనీకి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. అయినా కూడా, ‘కోటీశ్వరుడు తన తల్లి కోసం భిక్షాటన చేయడం’ అనే బలమైన కొత్త తల్లి సెంటిమెంట్ పాయింట్ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అతి తక్కువ అంచనాలతో, సాధారణ ప్రచారంతో విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా మెగా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ వసూళ్లు ఒరిజినల్‌ను మించిపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
3. గజినీ
ఒరిజినల్: గజినీ (తమిళం)
ఈ చిత్రంలో ఉపయోగించిన ‘షార్ట్-టర్మ్ మెమరీ లాస్’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ అప్పటి తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చింది. దర్శకుడు A.R. మురుగదాస్ టేకింగ్, సూర్య నటన ఎమోషనల్ ప్రేమకథ సినిమాకు బలంగా నిలిచాయి. తెలుగులో భారీ మార్కెట్‌ను సృష్టించిన తొలి తమిళ హీరోల్లో సూర్య ఒకరుగా మారడానికి ఈ సినిమా దోహదపడింది.
Read also-Rahul Sipligunj wedding: టాలీవుడ్ స్టార్ సింగర్ పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి తొలి ఆహ్వానం..
4. రంగం
ఒరిజినల్: కో (తమిళం)
జర్నలిజం, రాజకీయ నేపథ్యంతో సాగే పవర్‌ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమా విడుదలయింది. కె.వి. ఆనంద్ దర్శకత్వం, అద్భుతమైన స్క్రీన్‌ప్లే, సస్పెన్స్‌తో కూడిన మలుపులు సినిమాను ప్రేక్షకుడికి కట్టిపడేశాయి. తమిళంలో కంటే తెలుగులోనే ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు నమోదయ్యాయి.
5. లవ్ ఫెయిల్యూర్
ఒరిజినల్: కాదలిల్ సొదప్పువదు ఎప్పడి (తమిళం)
ఈ సినిమా యూత్‌ని లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. ఇందులో చూపించిన రియలిస్టిక్ లవ్ బ్రేకప్స్ మరియు సరదా డైలాగ్‌లు తెలుగు యూత్‌కి చాలా బాగా కనెక్ట్ అయ్యాయి. తెలుగులో సిద్ధార్థ్ స్వయంగా పంపిణీ చేయడంతో, మంచి ప్రచారం లభించి ఒరిజినల్ కంటే పెద్ద హిట్‌గా నిలిచింది.
ఈ డబ్బింగ్ సినిమాల విజయానికి ప్రధాన కారణం బలమైన కథాంశం, సమర్థవంతమైన తెలుగు డబ్బింగ్. డబ్బింగ్ పనులు నాణ్యతగా ఉండటం, తెలుగు నేటివిటీకి దగ్గరగా డైలాగులు రాయడం కూడా ఈ సినిమాల విజయానికి దోహదం చేశాయి. మంచి కంటెంట్ ఉంటే, భాషతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాలు నిరూపించాయి.
