Medigadda Project: మేడిగడ్డ ప్రాజెక్టు డిజైన్ ఒటైతే.. నిర్మాణం మరోలా సాగిందని, అందుకే ప్రాజెక్టు కుంగిపోయిందని ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మాణ మెటీరియల్ సక్రమంగా లేదని, నిర్వహణ కూడా సరిగా లేదని డ్యాం సేఫ్టీ అధికారులు చెప్పారని గుర్తు చేశారు. అసలు మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు సరికాదని తాను చెప్పారని, కానీ, బీఆర్ఎస్ మొండిగా ముందుకెళ్లి అక్కడే నిర్మాణం చేపట్టిందని విమర్శించారు. ఆర్థిక పరమైన అంశాల్లోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని క్యాట్ చెప్పిందని వివరించారు. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్‌కు ముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సుజల స్రవంతి పేరుతో ప్రారంభించారని తెలిపారు.
తుమ్మిడిహెట్టి నుంచి కాలువల ద్వారా నీరుని తెచ్చుకోగలిగితే గతంలో ఖర్చు చేసిన నిధులకు సార్థకత లభిస్తుందని కోదండరాం వివరించారు. అందుకే తుమ్మిడిహెట్టిని పరిశీలించాలని ప్రభుత్వాన్ని, కమిషన్‌ను కోరామని చెప్పారు. ఇంజనీర్ సూచనలను గత ప్రభుత్వం బేఖాతరు చేసిందని పేర్కొన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. కమిషన్ వేయాలని కోరిందే బీఆర్ఎస్ అని గుర్తు చేస్తూ కమిషన్ వేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అసెంబ్లీలో బీఆర్ఎస్ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు.
ప్రజల సొమ్మును బాధ్యతగా ఖర్చు పెట్టాలని చెప్పిన కోదండరాం.. బీఆర్ఎస్ పార్టీ కమిషిన్‌ను రద్దు చేయించి వాస్తవాలు బయటకు రాకుండా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నదని ఆరోపించారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ తమపై కేసులను ఎత్తువేయాలని కోరడం బాధ్యతారాహిత్యమేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తమపై నమోదైన కేసులను ఎత్తివేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నట్టు తెలిపారు. ఇక బొగ్గు గనులను వేలం వేయడమంటే ప్రైవేటీకరణకు దారి వేసినట్టేనని, దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు స్పష్టం చేశారు. బొగ్గు గనులు సింగరేణికే అప్పగించాలని కేంద్రాన్ని కోరుతామని కోదండరాం చెప్పారు.